* పలు ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇటీవల వెలుగులోకి వచ్చిన సరోగసీ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి .ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న లక్ష్మి, పలు ఆస్పత్రులకు ఏజెంట్గా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. లక్ష్మి అక్రమ సరోగసీ కార్యకలాపాలను నిర్వహించడంలో ఈ ఆస్పత్రుల పాత్రపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో, అక్రమ సరోగసీ(SURROGACY) లో పాల్గొన్న ఆస్పత్రుల జాబితాను పోలీసులు రూపొందించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు.
ఎవరీ లక్ష్మి…
గతంలో ముంబైలో హ్యూమెన్ ట్రాఫికింగ్ కేసులో జైలు పాలై విడుదలైన లక్ష్మి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట. ఎలాంటి కష్టాలు లేకుండా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో లక్ష్మి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్తున్నారు. ముంబైలో జైలు నుంచి విడుదలైన తరువాత హైద్రాబాద్ కు మకాం మార్చిన లక్ష్మి తన కుమారుడితో కలిసి ఈ దందా కొనసాగించింది.తన ఇంటిపైన బ్యాచిలర్స్ కు మాత్రమే గదులు అద్దెకిచ్చి వారి వద్ద నుండి వీర్యాన్ని సేకరించి సరోగసీ దందాకు పాల్పడింది. కర్ణాటక కి చెందిన మహిళ భర్త ఫిర్యాదుతో లక్ష్మిరెడ్డి భాగోతం బయటపడింది. కర్ణాటకకు చెందిన మహిళకు డబ్బు ఆశ చూపి సరోగసీ ద్వారా బిడ్డను కని ఇవ్వాలనే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయం తెలిసని సదరు మహిళ భర్త దీనికి అంగీరించకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మి చేస్తున్న సరోగసీ దందా బయట పడింది.
సరోగసీ కేసులో ఆస్పత్రులకు నోటీసులు
నిందితురాలు లక్ష్మి ఏజెంట్గా ఉన్నట్లు తేలిన ఆస్పత్రులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆస్పత్రుల యాజమాన్యాలు, సంబంధిత వైద్య సిబ్బందిని విచారించి పూర్తి వివరాలు సేకరించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. నోటీసులు అందుకున్న ఆస్పత్రుల జాబితాలో హెగ్దే, లక్స్ ఆసుపత్రి, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్, ఫర్టీ కేర్, అమూల్య ఫెర్టిలిటీ, శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. ఈ ఆస్పత్రులలో అక్రమ సరోగసీ కార్యకలాపాలు ఎలా జరిగాయి, వాటిలో ఎంతమంది పాల్గొన్నారనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
………………………………..
