* హైదరాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి..
* కరెంట్ షాక్ తగిలి ఐదుగురు మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ (Hyderabad)రామంతాపూర్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఆనందంగా.. సందడిగా సాగుతున్న రథయాత్రలో కలకలం రేగింది. కృష్ణనామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్న ఆ ప్రాంతంలో అంతలోనే హాహాకారాలు మొదలయ్యాయి. రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రామంతాపూర్‌లో (Ramanthapu) ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కృష్ణాష్టమి (Krishnastami) సందర్భంగా గోకులేనగర్‌లో ఆదివారం రాత్రి రథయాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలో రథాన్ని లాగుతున్న వాహనం బ్రేక్ డౌన్ అయింది. దానిని పక్కన నిలిపివేసిన యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. దానికి కరెంటు తీగలు తగలడంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టింది. దీంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మృతిచెందిన వారిలో కృష్ణయాదవ్ (21), సురేశ్ యాదవ్ (34), శ్రీకాంత్‌రెడ్డి (35), రుద్రవికాస్ (39), రాజేంద్రరెడ్డి (45) ఉన్నారు. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
