UPI New Rules
* అక్టోబర్ 15 నుంచి UPI కొత్త నిబంధనలు
* వ్యాపారులపై ఎండీఆర్ భారం..
* కస్టమర్లకు రూపాయి చార్జ్ లేదు
ఆకేరు న్యూస్, డెస్క్ : భారతదేశ డిజిటల్ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చిన ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (UPI) విధానంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక మార్పులు ప్రకటించింది. ఇన్నాళ్లూ కొనసాగిన పూర్తి ఉచిత లావాదేవీల విధానానికి ముగింపు పలుకుతూ, వ్యాపారులపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) విధిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
* ఎవరిపై ప్రభావం ఉంది..
వ్యక్తుల నుంచి వ్యాపారులకు (P2M) రూ. 2,000 కంటే ఎక్కువ జరిగే UPI లావాదేవీలపై 0.4 శాతం MDR విధించబడుతుంది. రూ. 75,000 కంటే ఎక్కువ విలువైన ప్రతి లావాదేవీపై గరిష్టంగా రూ. 300 మాత్రమే MDR వసూలు చేస్తారు. రైల్వే, టెలికం, బీమా, పెట్రోల్ బంకులు (ఇంధనం), ప్రభుత్వ సర్వీసులకు రూ. 2,000 కంటే ఎక్కువ జరిపే లావాదేవీలపై శాతం లెక్కన కాకుండా ఫ్లాట్‌గా ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 5 చార్జీ పడుతుంది.
* వినియోగదారులకు పూర్తి ఉపశమనం..
ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు పంపే డబ్బులపై ఎలాంటి చార్జీలు ఉండవు. నెలవారీ లావాదేవీలు తక్కువగా ఉండే కిరాణా, చిన్న వ్యాపారులకు (P2PM) ఈ నిబంధన నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. రూ. 2,000 వరకు జరిపే వ్యాపార చెల్లింపులు ఎప్పటిలాగే పూర్తి ఉచితం.
విధించబడే MDR రుసుమును వ్యాపారులే భరించాలని, ఏ పరిస్థితుల్లోనూ కస్టమర్ల ఖాతా నుంచి వసూలు చేయకూడదని ఆర్థిక శాఖ నిబంధన విధించింది. UPI డిజిటల్ నెట్వర్క్, సైబర్ సెక్యూరిటీ, సర్వర్ మౌలిక వసతుల నిర్వహణ ఖర్చుల కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
