Thummala Nageswara Rao on Telangana Agriculture Education
* ఆయిల్ పామ్ సాగుపై మంత్రి తుమ్మల అసెంబ్లీ స్పీచ్
* * ఎకరానికి ₹46,250 సాయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యానవన (Horticulture) పంటలు మరియు ఆయిల్ పామ్ (Oil Palm) సాగును సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేసిందని వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభలో వెల్లడించారు. అసెంబ్లీలో ఉద్యానవన పంటల ప్రోత్సాహం, ఆయిల్ పామ్ విస్తరణపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన పాయింట్ టు పాయింట్ సమగ్ర సమాధానం ఇచ్చారు.
*2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల లక్ష్యం
రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వివిధ పథకాల ద్వారా అదనంగా 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు రచించినట్లు మంత్రి వివరించారు. ఈ పంటల సాగును ప్రోత్సహించేందుకు బిందు, తుంపర సేద్య పరికరాలు, మల్చింగ్, షేడ్ నెట్లు, శీతల గిడ్డంగులు, పందిళ్లు వంటి వాటిపై రైతుల నిబంధనల ఆధారంగా 40% నుండి 90% వరకు భారీ రాయితీ అందిస్తున్నామని తెలిపారు.
*రూ. 654 కోట్ల భారీ నిధుల కేటాయింపు
ఉద్యాన పంటల రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ వివరాలను మంత్రి అసెంబ్లీకి వివరించారు.
మల్చింగ్, షేడ్ నెట్లు, కోత అనంతర మౌలిక వసతులు, శీతల గిడ్డంగులు, శాశ్వత పందిళ్ల ఏర్పాటుకు ₹150 కోట్లు. బిందు మరియు తుంపర (Drip & Sprinkler) సేద్యం కల్పనకు ₹243 కోట్లు. ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి పథకాల నిర్వహణకు ₹261 కోట్లు.
* ఆయిల్ పామ్ సాగులో జాతీయ రికార్డు..
ప్రస్తుతం రాష్ట్రంలో 88,282 మంది రైతులు 3.20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు. NMEO-ఆయిల్ పామ్ పథకం కింద 2021-22 నుండి 2.74 లక్షల ఎకరాల సాగుతో తెలంగాణ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. డిసెంబర్ 2023 నుండి ఇప్పటివరకు కొత్తగా 1.37 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగులోకి తీసుకొచ్చామని, 2026-27 సంవత్సరానికి నిర్దేశించిన 85,000 ఎకరాల లక్ష్యంలో ఇప్పటికే 29,053 ఎకరాల్లో మొక్క నాటే ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.
* రైతులకు ఎకరానికి ₹46,250 ఆర్థిక సహాయం
సాంప్రదాయ పంటల కంటే ఆయిల్ పామ్ సాగు లాభదాయకమని పేర్కొన్న మంత్రి, రైతులను ప్రోత్సహించేందుకు తొలి 4 సంవత్సరాలకు గాను మొక్కలు, డ్రిప్, ఎరువులు, అంతర పంటల సాగు నిర్వహణ నిమిత్తం ఎకరానికి మొత్తంగా ₹46,250 అందిస్తున్నట్లు తెలిపారు. 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్ధారించిన కంపెనీలే గెలలను కొనుగోలు చేస్తాయని, ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు ₹24,025 ఉందన్నారు.
* కొత్తగా 6 ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లులు
రాష్ట్రంలో ప్రస్తుతం 4 మిల్లులు (అశ్వారావుపేట, అప్పారావుపేట, నెర్మట్ట, అంజనాపురం) నడుస్తున్నాయని, త్వరలోనే కొత్తగా 6 మిల్లులు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు.
- కల్లూరుగూడెం (ఖమ్మం)
- ఇంచెర్ల (ములుగు)
- పెద్దరాతి (పెద్దపల్లి)
- సైనిపాక (భూపాలపల్లి)
- యాచారం (నల్గొండ)
- శంకరెడ్డిపల్లి (వనపర్తి)
సిద్దిపేట జిల్లా నెర్మట్టలో ఆయిల్ ఫెడ్ ద్వారా రిఫైనరీ, ఆధునిక ప్యాకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే పనులు వేగంగా జరుగుతున్నాయని తుమ్మల పేర్కొన్నారు. కాగా, జుక్కల్ నియోజకవర్గంలో బొప్పాయి మార్కెట్ ఏర్పాటుపై స్పందిస్తూ, అక్కడ కేవలం 36 ఎకరాల్లో మాత్రమే బొప్పాయి సాగవుతున్నందున ప్రస్తుతానికి ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
