* ఎక్కడ చూసినా మాంసపు ముద్దలు
* కర్నూలు ఘటనలో షాకింగ్ అంశాలు
* మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
* కేంద్రం రూ.2 లక్షలు
ఆకేరు న్యూస్, కర్నూలు : అంతా గాఢ నిద్రలో ఉన్నారు.. బస్సు జోరుగా ముందుకు సాగుతోంది. ఇంతలో ఓ బైకు బస్సును ఢీ కొట్టింది. ముందు భాగం గుండా బస్సు కిందకు బైకు దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్ బైకును అలానే కొంత దూరం లాక్కెళ్లడంతో నిప్పురవ్వలు రేగి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సును వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు. గాఢనిద్రలో ఉన్నవారు బస్సు సీట్లలోనే అస్తి పంజరాలుగా మారారు. బస్సులో ఎక్కడ చూసినా మాంసపు ముద్దలు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదం పెను విషాదం నింపింది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సును ఢీకొట్టిన బైకర్ శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుగా అధికారులు గుర్తించారు. కాగా, ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో 21 మంది ప్రయాణికులు బయటపడ్డారు. బస్సు వెనుక అద్దాలు పగులగొట్టి కొంత మంది ప్రయాణికులు తోటి ప్రయాణికులను రక్షించారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి హైమా రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. తాము పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. ఆ సమయంలో బస్సు తగలబడుతుండటం చూసి అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. ఆ సమయంలో అగ్నికి ఆహుతవుతున్న ఆ బస్సులో ప్రయాణికుల అస్థిపంజరాలు, చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయని.. అవి చూసి తట్టుకోలేకపోయామని తెలిపారు. వెంటనే తేరుకుని.. కర్నూలు ఎస్పీకి ఫోన్ చేసినట్లు హైమా తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ.. బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిలో సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో తేరుకునేలోపు బస్సు దగ్ధమైందని అన్నారు. బస్సు డీజిల్ ట్యాంకర్ దెబ్బతినలేదని, బైక్ ఢీకొని మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ 19 మంది మృతదేహాలను వెలికితీసినట్లు కలెక్టర్ సిరి తెలిపారు. కాగా, బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కేంద్రం రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
………………………………………….
