Kamalapur Cricketer Sai Teja
*జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో మెరిసిన కమలాపూర్ MJP పూర్వ విద్యార్థి ‘సాయి తేజ’
* బెస్ట్ ఫీల్డర్‌గా రికార్డు
* రూ. 20 వేల ప్రోత్సాహక చెక్కు అందజేసి ప్రశంసించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే (MJP) గురుకుల బాలుర పాఠశాల పూర్వ విద్యార్థి మాసం పెళ్లి సాయి తేజ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి పాఠశాలకు విశేష ఖ్యాతి తీసుకువచ్చాడు. 2019 నుండి 2024 వరకు కమలాపూర్ ఎంజెపి బాలుర గురుకుల పాఠశాలలో 5- 10వ తరగతి వరకు చదివిన సాయి తేజ, 2023-24 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన విద్యార్థి.
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్-20 క్రికెట్ పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అసోసియేషన్ (SGFI) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-19 జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించి, తన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో బెస్ట్ ఫీల్డర్ అవార్డును కైవసం చేసుకున్నాడు.
* మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక అభినందనలు
ఈ విజయాన్ని పురస్కరించుకొని ఎంజెపి బిసి గురుకుల సొసైటీ తరఫున సాయి తేజను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ. 20,000 నగదు చెక్కును తన చేతుల మీదుగా అందజేశారు.
* ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
సాయి తేజ కృషి, పట్టుదల నేటి గురుకుల విద్యార్థులకు ఆదర్శం. భవిష్యత్తులో అతను ఐపీఎల్ (IPL) వంటి ప్రతిష్టాత్మక లీగ్‌లలో రాణించి, భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అన్ని వేళలా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి OSD జి. తిరుపతి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్సిఓ మోతె రాజకుమార్, కాజీపేట ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి, కమలాపూర్ బాలుర పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ తాడూరి రవీందర్ పాల్గొన్నారు.
