* అసెంబ్లీలో, మంత్రివర్గంలో చర్చించరా
* బీజేపీ ఎందుకు మాట్లాడం లేదు
* అది భారీ భూ కుంభకోణం : మాజీ మంత్రి హరీశ్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : రూ.5 లక్షల కోట్లు వచ్చే భూములకు రూ. 5 వేల కోట్లు మాత్రమే ఎలా వస్తాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం ఏళ్ల సంవత్సరాల క్రితం కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూములను ఆఘమేఘాల మీద ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. మంత్రి మండలిలో, అసెంబ్లీలో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని అన్నారు. రెండు నెలల్లోనే ప్రక్రియ అంతా పూర్తి చేయడం వెనుక కుట్ర ఏముందో అన్నారు. ఆ భూములకు బహిరంగ వేలం వేస్తే రూ.5 లక్షల కోట్లు వస్తాయని తెలిపారు. ప్రభుత్వ అవసరాలకు కూడా భూమి లేకుండా ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు పంపించాలనే పాలసీ అని, కానీ ఈ ప్రభుత్వం గ్రీన్ ఇండస్ట్రీలను కూడా బయటకు పంపేందుకు ప్లాన్ చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100 శాతం నుంచి 200 శాతం అధికంగా వసూలు చేయాలని చట్టం చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 30 శాతానికే అప్పగించేందుకు కుట్ర పన్నుతోందన్నారు. 7 రోజుల్లో దరఖాస్తులు 7 రోజుల్లో ఆమోదం 45 రోజుల్లో క్రమబద్ధీకరణ ఎవరికి లాభం చేకూర్చడానికని ప్రశ్నించారు. భారీ భూ కుంభకోణంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.
