E20 Petrol Safety concerns cleared by Ministry of Petroleum and Natural Gas
* ఇంజిన్‌కు ఎలాంటి ప్రమాదం లేదన్న ప్రభుత్వం
ఆకేరు న్యూస్, డెస్క్: E20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన పెట్రోల్) వాడితే వాహనాల ఇంజిన్లు పాడవుతాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. శాస్త్రీయ పరీక్షలు, కోట్లాది వాహనాల సర్వీస్ డేటా ఆధారంగా E20 ఇంధనం సురక్షితమని, ఇంజిన్ పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని వెల్లడించింది. అలాగే ఎలాంటి ఆధారాలు లేని పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.
* ఇంజిన్‌కు నష్టం లేదన్న కేంద్రం
పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో గత రెండున్నరేళ్లుగా E19-E20 పెట్రోల్ విస్తృతంగా వినియోగంలో ఉంది. ఈ కాలంలో ఇథనాల్ కారణంగా ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిరోజూ సుమారు 8 కోట్ల వాహనాలు పెట్రోల్ బంకులను వినియోగిస్తున్నాయని, 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఇప్పటికే E20 ఇంధనంతో విజయవంతంగా నడుస్తున్నాయని వెల్లడించింది.
మారుతి సుజుకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో సర్వీస్ చేసిన 2.84 కోట్ల వాహనాల డేటాను పరిశీలించగా.. అందులో E20 సర్టిఫికేషన్ లేని సుమారు 1.5 కోట్ల పాత వాహనాల్లో కూడా ఇంజిన్ తుప్పు, అసాధారణ అరిగిపోవడం లేదా విడిభాగాల జీవితకాలం తగ్గినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని ప్రభుత్వం పేర్కొంది.
* మైలేజ్‌పై ఏమంది?
కొన్ని పాత వాహనాల్లో E20 వాడకంతో మైలేజ్ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే మైలేజ్ అనేది కేవలం ఇంధనంపైనే ఆధారపడదని.. డ్రైవింగ్ విధానం, ట్రాఫిక్ పరిస్థితులు, టైర్ల గాలి ఒత్తిడి, వాహన నిర్వహణ వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని స్పష్టం చేసింది. అదే సమయంలో E20 వల్ల అధిక ఆక్టేన్ రేటింగ్, స్మూత్ ఇంజిన్ పనితీరు, మెరుగైన ఆక్సిలరేషన్, తక్కువ కాలుష్యం వంటి ప్రయోజనాలు లభిస్తాయని వెల్లడించింది.
* వాహన తయారీ సంస్థల పూర్తి మద్దతు
E20 ఇంధనాన్ని వాహన తయారీ సంస్థలపై ఒత్తిడి తెచ్చి అమలు చేస్తున్నారన్న ప్రచారాన్ని కూడా కేంద్రం ఖండించింది. టయోటా, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, హ్యుందాయ్, టీవీఎస్, బజాజ్ ఆటో వంటి ప్రముఖ కంపెనీలు E20కు పూర్తి మద్దతు ప్రకటించాయని తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కఠిన పరీక్షల అనంతరమే E20ను దేశవ్యాప్తంగా అమలు చేశామని, E20 వాడే వాహనాలకు కంపెనీలు వారంటీని యథావిధిగా కొనసాగిస్తున్నాయని పేర్కొంది.
* దేశానికి కలిగిన ప్రయోజనాలు
ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం వల్ల విదేశీ మారకద్రవ్య వ్యయంలో రూ.1.97 లక్షల కోట్లకు పైగా ఆదా జరిగిందని కేంద్రం వెల్లడించింది. అలాగే సుమారు 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గడంతో పాటు 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని తెలిపింది. రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం చేరిందని కూడా వివరించింది.
* మూలం: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) – కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రకటన
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2283118®=3&lang=1
Please tell us what is wrong. Your report will be sent to the website team.
