* ‘‘రెమాల్’’గా నామకరణం
* తీరం దాటే సమయంలో 102 కిలోమీటర్లతో వాయువేగం
* వేటగాళ్లు ఆదివారం వేటకు వెళ్లొద్దు : ఐఎండీ
* తెలుగు రాష్ట్రాలలోనూ రెండు రోజుల పాటు వర్షాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : భారత వాతావరణ శాఖ ఈ వర్షాకాల సీజన్లో తొలి తుఫాన్ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనమై తీవ్ర తుఫాన్‌గా మారనుందని పేర్కొంది. ఇది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను తాకుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 26-27 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, దక్షిణ మణిపూర్ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ తుఫానుకు రెమాల్ గా నామకరణం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం శనివారం నాటికి తుఫాన్‌గా మారుతుంది. ఇది మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఐఎండీ తెలిపింది. తుఫాన్ కారణంగా తీర ప్రాంతంలో గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపారు. మే 27 వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని, సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి తీరప్రాంతానికి చేరుకోవాలని సూచించారు. ఈ తుఫాను కారణంగా ఏపీ, తెలంగాణలో కూడా రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
——————-