ఆకేరు న్యూస్, డెస్క్:వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం అటు ఆధ్యాత్మికత, ఇటు రాజకీయం మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నేడు ప్రారంభం కానుంది. లక్షలాది మంది భక్తులు వన దేవతల దర్శనం కోసం తరలివస్తున్నారు.అయితే, సరిగ్గా ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం జిల్లాలో సంచలనంగా మారింది. నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులు, రాజకీయ నేతలు అయోమయంలో పడ్డారు. అటు అమ్మవార్లను దర్శించుకోవాలన్న భక్తి, ఇటు ఎన్నికల బరిలో దిగాలన్న బాధ్యత మధ్య జనం సతమతమవుతున్నారు. జాతర కోలాహలం, ఎన్నికల వేడి ఒకేసారి రావడంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది.
……………………………………
