* నేటి సాయంత్రం ఫైనల్ చేసే అవకాశం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణ చిహ్నం, గీతంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. ఇప్పటికే వాటిపై తుది నిర్ణయానికి వచ్చింది. ఈమేరకు ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించేందుకు నేటి సాయంత్రం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉద్యమకారులు, సీపీఎం, సీపీఐ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో లోగో, గీతంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర గీతాన్ని అందెశ్రీ రూపొందించగా, ఆస్కార్ విన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసి జయ జయహే తెలంగాణ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నాన్ని రూపొందించే బాధ్యతలను కళాకారుడు రుద్ర రాజేశానికి అప్పజెప్పారు. రుద్ర రాజేశం.. ఇప్పటికే పలు డిజైన్లను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి చూపించగా.. తుదిరూపుపై జూబ్లీహిల్ని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కళాకారుడు రుద్ర రాజేశంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. దీంతో.. కొత్త అధికార చిహ్నాం ఎలా ఉంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా, అధికారిక చిహ్నానికి సంబంధించిన లోగో ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరవీరుల స్తూపం, వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా వరి వంగడాలు, బతుకమ్మతో పాటు మూడు రంగులతో కూడిన చిహ్నం బాగా వైరల్ అవుతోంది. దానిపై నాలుగు భాషల్లో (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దు) తెలంగాణ పేరు కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
———————————