వరంగల్ నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ’ వేడుకల్లో ఫుడ్ పాయిజనింగ్..
ఆకేరు న్యూస్, హన్మకొండ: ప్రతిష్టాత్మక విద్యాసంస్థ వరంగల్ నిట్ (NIT)లో విషాదం చోటుచేసుకుంది. కళాశాల వార్షికోత్సవ వేడుకలైన ‘స్ప్రింగ్ స్ప్రీ-2026’ ఆనందంగా జరుగుతున్న సమయంలో, సుమారు 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురై అస్వస్థతకు లోనుకావడం తీవ్ర కలకలం రేపింది. నిట్ క్యాంపస్‌లో శనివారం అర్ధరాత్రి వరకు ‘స్ప్రింగ్ స్ప్రీ’ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులలో కొందరు క్యాంపస్‌లోని ఫుడ్ స్టాల్స్‌లో ‘షవర్మ’ తిన్నట్లు సమాచారం. వేడుకలు ముగించుకుని హోస్టళ్లకు వెళ్లిన సుమారు 12 గంటల తర్వాత, అంటే ఆదివారం తెల్లవారుజామున విద్యార్థులకు వాంతులు, విరేచనాలు మరియు తీవ్రమైన కడుపునొప్పి మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిలో మెజారిటీ విద్యార్థులు ఫైనల్ ఇయర్ (చివరి సంవత్సరం) చదువుతున్న వారే కావడం గమనార్హం.
చికిత్స మరియు ప్రస్తుత పరిస్థితి:
బాధిత విద్యార్థులకు తొలుత నిట్ క్యాంపస్‌లోని ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హన్మకొండ నగరంలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి వారిని తరలించారు. ప్రస్తుతం విద్యార్థులందరూ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్య వర్గాలు ధృవీకరించాయి.
తల్లిదండ్రులు వాదనలు:
ఈ ఘటనపై నిట్ యాజమాన్యం మరియు విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి…వేడుకల కారణంగా విద్యార్థులు అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం వల్ల అలసట చెందారని, డీ-హైడ్రేషన్‌కు గురై ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. బయటి ఫుడ్ స్టాల్స్‌లో జంక్ ఫుడ్ తినడం వల్లే ఈ అస్వస్థత కలిగి ఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. క్యాంపస్ మెస్‌లో నాణ్యమైన ఆహారమే అందిస్తున్నామని వారు సమర్థించుకుంటున్నారు. మెస్‌లో అందించే భోజనం నాసిరకంగా ఉండటమే ఈ పరిస్థితికి కారణమని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐఎఫ్ సీ (IFC) మెస్‌లో భోజనం అత్యంత అధ్వాన్నంగా ఉంటుందని, గత రెండు నెలల క్రితం కూడా ఇలాగే కొందరు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారని ఒక విద్యార్థి తండ్రి ఆరోపించారు. మెస్ కాంట్రాక్టర్‌ను మార్చినా పరిస్థితిలో మార్పు రాలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని వారు వాపోతున్నారు. సుమారు 8 వేల మంది విద్యార్థులు ఉండే నిట్ క్యాంపస్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఆహార నాణ్యతపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
