ఆడపిల్ల పుడితే రూ. 5వేలు ఆర్థిక సాయం!!
ఆకేరు న్యూస్,కరీంనగర్:శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో సామాజిక బాధ్యతతో కూడిన ఓ అరుదైన సంఘటన వెలుగుచూసింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గాజుల మహేష్, స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్సీ కాలనీ నివాసితులకు మహేష్ ఒక హామీ ఇచ్చారు. కాలనీలో ఎవరికైనా ఆడపిల్ల జన్మిస్తే రూ. 5,000, ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. పదవి దక్కకపోయినా, చెప్పిన మాట ప్రకారం ఆయన సాయం అందించడం గమనార్హం. గ్రామానికి చెందిన దాసారపు తిరుపతి దంపతులకు ఆడపిల్ల జన్మించగా, మహేష్ రూ. 5,000 నగదును అందజేశారు. అనారోగ్యంతో మరణించిన కాసర్ల సమ్మయ్య కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ నగదును పంపిణీ చేశారు. ఓడినా ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటున్న గాజుల మహేష్‌పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దండు రాజేష్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నేరెళ్ల సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
