*తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఆకేరు న్యూస్, డేస్క్: తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పార్లమెంట్ భవనంలో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు కీలక రైల్వే ప్రాజెక్టులపై చర్చించిన సీఎం, వాటిని వేగవంతం చేయాలని కోరారు.
వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్గంలోని టేకల్‌కోడ్ ప్రాంతంలో భారీగా సున్నపురాయి (Limestone) నిక్షేపాలు ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని సిమెంట్, జౌళి పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా కొడంగల్, టేకల్‌కోడ్, దౌల్తాబాద్‌లను పారిశ్రామిక జోన్లుగా తీర్చిదిద్దుతున్న క్రమంలో ఈ రైల్వే లైన్ అత్యంత కీలకంగా మారనుంది.
శంషాబాద్ కేంద్రంగా హైస్పీడ్ రైలు కారిడార్లు:
హైదరాబాద్ నుంచి ఇతర మెట్రో నగరాలకు అనుసంధానాన్ని పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనలు చేశారు
హైస్పీడ్ కారిడార్లు: హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – పుణే హైస్పీడ్ రైలు కారిడార్ల కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో 500 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ట్రై జంక్షన్: ఈ మూడు హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే ప్రారంభమైతే, అది దేశంలోనే ఒక కీలకమైన ‘ట్రై జంక్షన్’గా మారుతుందని, ప్రయాణికులకు విమాన-రైలు ప్రయాణం సులభతరం అవుతుందని సూచించారు.
అమరావతి – బందరు పోర్టు అనుసంధానం: హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళ్లేలా ప్లాన్ చేసి, అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం నిర్మించాలని కోరారు. దీనివల్ల రాష్ట్రంలోని డ్రైపోర్ట్ నుంచి సరుకు రవాణా వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు..
*కేంద్ర మంత్రి సానుకూల స్పందన
ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ వేగవంతం అయితే, పనులు వెంటనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
