Maost party Leaders Malla rajireddy, Devjee
* మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహ రెడ్డిలు కూడా ..
* మరో 20 మంది మావోయిస్ట్‌ల లొంగుబాటు
* రెండు రోజుల్లో మీడియా ముందు హాజరు పరిచే అవకాశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీపీఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ తెలంగాణ పోలీసుల మందు లొంగిపోయినట్లు సమాచారం .దేవ్ జీతో పాటు మావోయిస్ట్ పార్టి పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ , మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటి సభ్యుడు నూనే నర్సింహారెడ్డి అలియాస్ గంగన్నలతో పాటు 20 మంది మావోయిస్ట్‌లు తెలంగాణ పోలీసుల ముందు లొంగి పోయారు. రెండు మూడు రోజుల్లో మీడియా ముందు హాజరు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. గత వారం రోజులుగా దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు పోలీసులకు లొంగిపోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. కాగా తెలంగాణ పోలీస్ అధికారులు మాత్రం మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు లొంగిపోయారని ధృవీకరించలేదు.

* మావోయిస్ట్ పార్టీ ప్రస్థానం ముగిసినట్లేనా..?
సీపీఐ మావోయిస్ట్ పార్టీ ఆపరేషన్ కగార్ తో కకావికలం అయింది. భారీ సంఖ్యలో పోలీస్ బలగాలు, అత్యంత ఆధునిక ఆయుధాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు ఇతర సాంకేతిక పరికరాలతో మావోయిస్ట్ పార్టీ దళాలపై విరుచుకుపడ్డాయి. దీంతో సీపీఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్ కౌంటర్లో మృతి చెందారు. మావోయిస్ట్ పార్టీ చరిత్రలో గతంలో ఎన్నడూ కూడా పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయి నాయకుడు ఎన్ కౌంటర్లో మృతి చెందలేదు. మావోయిస్ట్ పార్టీ దళపతి బసవరాజును కోల్పోవడంతో మావోయిస్ట్ పార్టీ కేడర్‌లో ఒక్కసారిగా నిస్పృహ అలుముకున్నది. మరోవైపు ఎన్ కౌంటర్ ల పరంపర కొన సాగడం పెద్ద ఎత్తున పీఎల్ జీఏ దళాలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆపరేషన్ కగార్ తో చత్తీష్ ఘడ్లో ఏకంగా శత్రు దేశాలతో జరిగినట్లుగా ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది. దీనికి తోడు పోలీస్ అధికారులు కేడర్ కాకుండా లీడర్ టార్గెట్‌గా ఆపరేషన్లను విస్తృతం చేశారు. ముఖ్యంగా పార్టీ రెండో అత్యున్నత శ్రేణి నాయకత్వం సెంట్రల్ కమిటీ నాయకులే లక్ష్యంగా వేట కొనసాగింది. అందులో విజయమూ సాధించగలిగారు. కేంద్ర కమిటి సభ్యులు వివేక్ , చలపతి, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కాతా రామచంద్రా రెడ్డి అలియాస్ రాజు ,సహదేవ్ సోరెన్ లు ఎన్ కౌంటర్లో మృతి చెందారు. అన్నిటికి మించి మావోయిస్ట్ పార్టీని అతలాకుతలం చేసింది హిడ్మా ఎన్ కౌంటర్ . హిడ్మా ఆదివాసీ ప్రజల్లో , మావోయిస్ట్ పార్టీ కేడర్‌లో బాగా పట్టు ఉన్న వ్యక్తి. హిడ్మా ఎన్ కౌంటర్ జాతీయ, అంతర్జాతీయంగా కూడా చర్చ నీయాంశమైంది. వరుస నష్టాలతో కోలుకోలేని స్థితికి మావోయిస్ట్ పార్టీ చేరుకున్నది. మిగిలిన కేంద్ర కమిటీ నాయకుల్లో పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ , మల్లా రాజిరెడ్డిలు మాత్రమే మిగిలారు. పాపారావు, నర్సింహరెడ్డి లాంటి కొద్ది మంది నాయకులతో పాటు 300 మంది వరకు పీఎల్ జీఏ సభ్యులు మిగిలారని పోలీసులు భావించారు. ఇక దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు కూడా లొంగిపోయారని అంటున్నారు. దీంతో మావోయిస్ట్ పార్టీ దాదాపు 45 ఏళ్ళ ప్రస్థానం ముగిసినట్లు అయింది.

* సోనూ, ఆశన్నల లొంగుబాటు కోలుకోలేని దెబ్బ
ఒక వైపు ఆపరేషన్ కగార్ పేరుతో పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున దాడులు కొనసాగించడంతో మావోయిస్ట్ కమాండర్లు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు మావోయిస్ట్ పార్టీ అత్యున్నత స్థాయి పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజులు వేణుగోపాల్ అలియాస్ సోను , కేంద్ర కమిటీ సభ్యడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నల లొంగుబాటు మావోయిస్ట్ పార్టీకి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని మాజీ మావోయిస్ట్ నేతలు అంటున్నారు. పార్టీ లైన్ తప్పుగా ఉందంటూ మారిన కాలానుగుణ పరిస్థితుల్లో సాయుధ పోరాటం అర్థం లేనిదంటూ వందల సంఖ్యలో పీఎల్ జీఏ కేడర్, తుపాకులతో పోలీసుల ముందు లొంగి పోయారు. దీంతో మావోయిస్ట్ పార్టీ ఒక వైపు పోలీస్ బలగాలు, మరో వైపు అంతర్గతంగా మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్ళ పల్లి వాసుదేవరావులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వరుస నష్టాలు చవిచూసింది. చివరకు మావోయిస్ట్ పార్టీలో మిగిలిన అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలు కూడా లొంగిపోవడంతో మావోయిస్ట్ పార్టీ సుదీర్ఘ ప్రస్థానం ముగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
————————–
