* ఇప్పటికే 60 మంది చని పోయారు
* ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి
* పెన్సన్ డబ్బులింకెప్పుడిస్తారు
* ఇది ‘భిక్ష’ కాదు.. మా ‘హక్కు’
* రిటైర్డ్ ఉద్యోగ సంఘాల ఆగ్రహం
ఆకేరు న్యూస్ , హన్మకొండ: మూసీ ప్రాజెక్ట్ పునరుజ్జీవం పేరుతో లక్ష కోట్లు ఖర్చు చేయడానికి సిద్ద పడుతున్న ప్రభుత్వానికి మాకు కేవలం 8 వేల కోట్లు లేవా అని రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. సోమవారం హునుమకొండ ఏకశిల పార్క్ సమీపంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘాల అద్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈసందర్భంగా రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు.
తమ జీవితకాలమంతా ప్రభుత్వ సేవలోనే ఉన్నామని , ఇపుడు రిటైర్మెంట్ తర్వాత రోడ్డున పడటంపై రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం అవలంబిస్తున్న ఉదాసీన వైఖరిని, “డబ్బులు లేవు.. ఏం చేసుకుంటారో చేసుకోండి” అనే రీతిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని సంఘం నాయకులు నరసింహ రెడ్డి మరియు దేవదాస్ లు తీవ్రంగా ఖండించారు.
రిటైర్మెంట్ తర్వాత లభించే ఆర్థిక ప్రయోజనాలు (Retirement Benefits) అనేవి ప్రభుత్వం ఇచ్చే దయాదక్షిణ్యాలు కావు. సర్వీస్ రూల్స్ ప్రకారం ఉద్యోగికి దక్కాల్సిన చట్టబద్ధమైన హక్కులని నాయకులు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సాకుతో మూడు ఏళ్లు పెన్షనరీ బెనిఫిట్స్ పెంచి వేలాది మందిని ఇబ్బందులకు గురిచేసిందన్నారు . ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించడం దుర్మార్గమని మండిపడ్డారు.
* 60 మంది మరణించినా కదలని ప్రభుత్వం
రిటైర్మెంట్ బకాయిలు అందక, అనారోగ్య సమస్యలతో వైద్యం చేయించుకోలేక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60 మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరణించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కనీసం మానవత్వం లేకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు. “మమ్మల్ని కోసినా డబ్బులు లేవు” అని ముఖ్యమంత్రి అనడం తమను అవమానించడమేనని పేర్కొన్నారు.
*మూసీకి లక్ష కోట్లు.. మాకు 8 వేల కోట్లు లేవా?
ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రశ్నిస్తూ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు దేవదాస్ కొన్ని కీలక ప్రశ్నలు సంధించారు.పథకాలు ఆగుతున్నాయా ? రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏ పథకాన్నైనా నిధులు లేవని ఆపారా? మరి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల దగ్గరికే వచ్చేసరికి నిధుల కొరత ఎలా వస్తుంది?
మూసీ సుందరీకరణ కోసం రూ. 1,50,000 కోట్లు వెచ్చిస్తామని చెబుతున్నారు. ఆ నిధులు అప్పుల రూపంలో తెస్తున్నప్పుడు, కేవలం రూ. 8,000 నుండి 9,000 కోట్లు ఉంటే తీరే రిటైర్మెంట్
బకాయిల కోసం అప్పు ఎందుకు తీసుకురాకూడదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 21,000 మంది రిటైర్డ్ అవ్వగా, దాదాపు 18,000 మందికి బకాయిలు రావాల్సి ఉంది. సగటున ఒక్కొక్కరికి రూ. 50 లక్షల వరకు రావాల్సి ఉందని, వెంటనే ఒకే విడతలో ఈ నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
* మొండి వైఖరీ వీడాలి
పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే ఒకే విడతలో (Lump sum) చెల్లించాలి.
ఆర్థిక ఇబ్బందులతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి.
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను కూడా ఒక ప్రత్యేక పథకంలా పరిగణించి ప్రాధాన్యత ఇవ్వాలి.
“మేము అడుగుతోంది మా కష్టార్జితం, మీ దయ కాదు. ఇకనైనా ప్రభుత్వం తన మొండివైఖరి వీడాలి” అని రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
పూర్తి వివరాల కోసం లింక్ చేయబడిన వీడియో చూడండి.
————————–
