* బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
* పురోహితులు, ఫంక్షన్ హాల్ యజమానులపై కేసులు
* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరిక
హనుమకొండ : బాలికల భవిష్యత్తుకు శాపంగా మారుతున్న బాల్యవివాహాలను అరికట్టడం మనందరి సామాజిక బాధ్యత అని వరంగల్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (SHARE) స్వచ్ఛంద సంస్థ మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ (AHTU) విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘బాల్యవివాహాల నిర్మూలన అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
* బాల్యం అమూల్యం .. భారంగా మార్చకండి
సమాజంలో వేళ్లూనుకున్న బాల్యవివాహాలనే దురాచారాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. బాల్యవివాహాల వల్ల ఆడపిల్లలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు గురవ్వడమే కాకుండా, వారి విద్యాభ్యాసం మధ్యలోనే ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్ల లోపు అమ్మాయిలకు, 21 ఏళ్ల లోపు అబ్బాయిలకు వివాహం చేయడం నేరమన్నారు . ఈ వివాహాలు చేసే తల్లిదండ్రులు, ప్రోత్సహించే బంధువులు, నిర్వహించే పురోహితులు ఫంక్షన్ హాల్ యజమానులపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తెలంగాణ ప్రభుత్వం బాలికల విద్య కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని, చిన్నారులు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ ప్రచార రథం కమిషనరేట్ పరిధిలోని గ్రామ గ్రామాన తిరుగుతూ బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలు మరియు చట్టపరమైన శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించనుంది. ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే 100 కు లేదా 1098 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రవి, ఏహెచ్‌టీయూ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, ఎస్.ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్ పాల్గొన్నారు. అలాగే ‘షేర్’ (SHARE) స్వచ్ఛంద సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ శిరీషతో పాటు జ్యానేశ్వరి, జమున, ప్రశాంతి, కల్పన, గాయత్రి, చామంతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
——————-
