* కన్నప్రేమ వీడలేదు.. మృత్యువూ విడదీయలేదు…
ఆకేరు న్యూస్, హన్మకొండ: ఆ తల్లి ప్రాణం కొడుకు కోసమే కొట్టుమిట్టాడింది.. ఆ కొడుకు ఊపిరి తల్లి పిలుపు కోసమే ఆగిపోయింది. విధి ఆడిన వింత క్రీడలో ఒకే రోజు, కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఇల్లు ఇద్దరు పెద్ద దిక్కులను కోల్పోయింది. ఉదయం కన్నతల్లి శివైక్యం చెందితే, సాయంత్రానికి కన్నకొడుకు ఆమె బాటలోనే వెళ్లిపోయాడు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాదం స్థానికుల కళ్లను చెమరుస్తోంది.
చిన్న హోటల్.. పెద్ద ఆశలు….
పసునూరి రామస్వామి, ఉపేంద్ర దంపతులది సామాన్య కుటుంబం. గ్రామంలో ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ, కష్టాన్ని నమ్ముకుని పిల్లలను పెంచి పెద్ద చేశారు. భర్త రామస్వామి గతంలోనే మరణించగా, ఉపేంద్ర (78) తన కుమారుడు నరహరి (55) నీడలో శేషజీవితాన్ని గడుపుతోంది. నరహరి కూడా తండ్రి బాటలోనే కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరి పెళ్లిళ్లు కాగా, చిన్న కుమార్తె ఇంటికి ఆసరాగా నిలిచింది.
కుమారుడి అనారోగ్యం.. తల్లి గుండెకోత
వారం రోజుల క్రితం నరహరికి అకస్మాత్తుగా ‘బ్రెయిన్ స్ట్రోక్’ రావడంతో కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడుకు పరిస్థితి చూసి ఆ వృద్ధురాలు తల్లడిల్లిపోయింది. “నా కొడుకు క్షేమంగా తిరిగి రావాలి” అని కోరుకున్న ఆ తల్లి గుండె, కొడుకు బాధను చూడలేక ఆందోళనతో బుధవారం ఉదయం ఆగిపోయింది. కన్నకొడుకు ఆసుపత్రిలో ఉండటంతో, విధిలేక కూతురే తల్లికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది.
తల్లి పిలుపు విన్నాడో ఏమో..!
అమ్మ అంత్యక్రియలు ముగిసి కొన్ని గంటలైనా గడవకముందే.. ఆసుపత్రి నుంచి మరో చేదు వార్త వచ్చింది. మృత్యువుతో పోరాడుతున్న నరహరి కూడా రాత్రి సమయంలో కన్నుమూశాడు. తల్లి వెళ్లిపోయిన రోజే కొడుకు కూడా వెళ్ళిపోవడంతో ఆ గ్రామం మూగబోయింది. “అమ్మను ఒంటరిగా పంపడం ఇష్టం లేక కొడుకు కూడా ఆమె వెంటే వెళ్ళిపోయాడా?” అంటూ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకే రోజు ఇద్దరి మరణంతో ఆ కుటుంబంలో అలుముకున్న చీకట్లు వర్ణనాతీతం. కష్టపడి బతికే కుటుంబంపై విధి చూపిన ఈ పగను చూసి పంథిని గ్రామం విషాదంలో మునిగిపోయింది.
—–
