Undatri Bhaskar Folk Singer
* మనసును కదిలించే పల్లె గాయకుడు ఉండాత్రి భాస్కర్
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి:
కడు పేదరికం ఒకటో తరగతితోనే చదువు ముగించేలా చేసింది. కానీ.. పాటపై ఉన్న మక్కువ అతడిని సమాజంలో మంచి గాయకుడిగా నిలబెట్టింది. పల్లె ఊసులు.. పల్లె మనసులను తన పాట ద్వారా వెలుగెత్తి చాటుతూ పల్లె గాయకుడిగా ముద్రవేసుకున్నాడు ఉండాత్రి భాస్కర్. ‘రేలా రే రేలా’ వేదిక ద్వారా తన ప్రతిభను చాటి సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న లాంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. భాస్కర్ ప్రస్థానం అతడి “పాట”ల్లోనే..
* ఒకటో తరగతి వరకే చదువు..
తన గాత్రం ద్వారా ఎంతో మందిని ఆకట్టుకుంటున్నది ఒకటో తరగతే. దాని గురించి భాస్కర్ చెబుతూ.. “మాది పేద కుటుంబం. ఒకటో తరగతి వరకే చదువుకున్నాను. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల మార్కెట్లో హమాలీ పని (బరువులు మోయడం) చేసేవాడిని. 20 ఏళ్లకే పెళ్ళయింది. పని చేసుకుంటూనే ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా వెళ్లి పాడేవాడిని. వరంగల్ లోని పలు కార్యక్రమాల్లో కూడా పాటలు పాడేవాడిని. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని కోరిక ఉండేది. సంగీతం చాలా ఇష్టం. 2006లో ఒక మాస్టారి దగ్గరికి వెళ్లారు, కానీ కుదరలేదు. ఆ తర్వాత పరకాలలో జగత్ అక్క దగ్గర ఒక ఏడాది పాటు బేసిక్స్ నేర్చుకున్నాను. పాట వింటే అటువైపు నా అడుగులు పడేవి. అలా ఉద్యమం వైపు వెళ్ళాను.” అని తన ప్రస్థానాన్ని “ఆకేరు న్యూస్” కు వెల్లడించారు.
* “జోహారులు జోహారులు.. అమరులకు జోహారు వీరులకు జోహారు..
తెలంగాణ ఉద్యమం సమయంలో భాస్కర్ పాడిన పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. ఆ స్మృతులను భాస్కర్ వెల్లడిస్తూ.. “జోహారులు జోహారులు… అమరులకు జోహారు వీరులకు జోహారు.. మావూళ్ల రేవుళ్ల మట్టి పొత్తిళ్లళ్ల.. అంటూ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి వంటి అమరవీరుల జ్ఞాపకార్థం పాటలు పాడేవాడినని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ఆశయాలను, అమర వీరుల త్యాగాను పాటల ద్వారా పాడి వినిపించారు. వినిపిస్తూనే ఉన్నారు.
* పాటల ద్వారా సామాజిక చైతన్యం..
ఉండాత్రి భాస్కర్ తన పాటల ద్వారా సామాజిక చైతన్యానికి కూడా కృషి చేసేవారు. కొందరు డాక్టర్లు ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నారు.. ఒక నాయకుడు ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నారు.. ఈ సందర్భంగా యాదగిరి అనే కవి రాసిన సామాజిక విలువల పాటల గురించి చెబుతూ..
“నువ్వు మనిషిగా పుట్టినందుకు మురిసిపో… పరుల కడుపు మార్చి బతకడమే మార్చుకో..
ఈ జన్మ నీవు ఎత్తినందుకు తెలుసుకో.. నిన్ను కన్నవాళ్లు నమ్మినోళ్లను మరవకు..
మోసం చేసి సుఖాలు పొందితే.. జనాలను దోచి గొప్పోడివైతే..
నీ అంత నీచమైన నీ అంత దోషమైన నీ అంత దగాకోరు చెడ్డవాడు లేడిక్కడ నాయకుడా.. పాలకుడా.. వర్తకుడా.. ” అంటూ హృద్యంగా పాడారు.
* సమస్యల వలయంలో ఆడపిల్ల గొప్పతనాన్ని వివరిస్తూ..
“ఆడపిల్ల బతుకు అంగడిలో సరుకు చేస్తోంది ఈ సమాజం”
ఆ బ్రతుకంత వెతుకు త్యాగాలే దొరుకు.. ఆడజన్మ గొప్పదే నిజము.
తల్లిగా తన త్యాగము.. చెల్లిగా అనురాగము.. ఆలిగా సగభాగము.. పంచగా అది మన యోగము..
ఆడజన్మ ఒక వరం.. జగతిన వెలుగుల వనం.. ఆ బతుకే తలచుకుంటే దినదిన కలకలం..” వంటి పాటలు కూడా భాస్కర్ గాత్రంలో ఉన్నాయి.
* ‘రేలా రే రేలా’ వేదికలో పాట పాడే అవకాశం ఎలా వచ్చిందంటే..
ఉద్యమ సమయంలో తన పాట ద్వారా జనాన్ని మేల్కొలిపిన భాస్కర్ ‘రేలా రే రేలా’ వేదికపై పాట పాడే అవకాశాన్ని పొందారు. అది ఎలా దక్కిందో భాస్కర్ మాటల్లో..
“వరంగల్ రత్న హోటల్లో సెలక్షన్స్ జరుగుతున్నాయి తెలిసి వెళ్లిన. సెలక్ట్ అయిన. అక్కడ సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ పాడేందుకు ఒక ఐదారు పాటలను ఎంచుకున్నాను. రెండు ఎపిసోడ్లు వచ్చినయి. ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యాను.” అని వివరించారు.
“సందులో సంసారి వేగడ్డి.. వాగులో వగలాడి వేగడ్డి..
సందులో సంసారి వేగడ్డి.. వాగులో వగలాడి వేగడ్డి..
గడ్డి అరె గడ్డి.. అరె గడ్డి నీ మీద మనసాయెనే..ష వంటి పాటల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మంచిగా పాడానని గోరటి వెంకన్న, సుద్దాల అశ్ క్ తేజ మెచ్చుకున్నారు.
పల్లె గాయకుడిగా ముద్ర
ఉద్యమ కాలంలో స్ఫూర్తి రగిలించిన భాస్కర్.. తదుపరి కాలంలో పల్లె గాయకుడిగా ముద్ర వేసుకున్నారు.
“వెనకటి నా పల్లె కలయందువాయే.. నేడు చూద్దామన్న కళ్ళగాన రాదాయే..
కురిసేటి వానల్ల తడిసి ముద్దై ఒడ్ల ఓరాలు చెక్కేరు ముద్దుగా..
గొర్రు గుంటుక కాడ జోడెడ్ల తోలు దోసులే పెట్టి పనులు చేస్తారు..
నారీమణులంతా నడుమొంచే సాళ్ళు నారు పీకి నాట్లు వేయంగా..”
శంకరా భగవంత గురుదేవా ఎదలోన దేవున్ని ఏలుకున్నరు..
వయ్యారంగా ఉయ్యాల పాటలు వీనసెంపుగా ఆడిపాడేది.. వంటి పాటల ద్వారా పల్లె సంస్కృతిలోనూ మారుతున్న తీరులను తన గాత్రం ద్వారా వెలుగెత్తి చాటారు. ఈ పాటను అమ్మపాట తిరుపతి రాసినట్లు వెల్లడించారు.
అమ్మ పాడిన పాట జ్ఞాపకం..
పల్లె గాయకుడిగా పేరు సంపాదించిన భాస్కర్ అమ్మ పాడిన పాటలను ఇంకా మరచిపోలేదని, అక్కడి నుంచే తనకు పాటపై ఆసక్తి కలిగిందని చెబుతూ.. అమ్మ వాళ్లు నాట్లు వేసేటప్పుడు పాడే పాటలను ఇలా వివరించారు.
“ఏములేని ఏములాడనా ఓ రాజన్న.. ఏము చూసి మెరిసినావు ఓ రాజన్న..
గుంపు సింతల చూస్తివా ఓ రాజన్న.. గుడి బండల చూస్తివా ఓ రాజన్న..
గుండాన స్నానాలయ్య ఓ రాజన్న.. నీ గుడిలో పూజలయ్య ఓ రాజన్న..”
తల్లిదండ్రుల గురించి భాస్కర్ గాత్రంలో..
“కనిపించని దేవుళ్ళురా.. కనిపించే మన అమ్మ నాన్న..
కదలాడలేని స్థితిలో ఉన్నారు కురిపించు నిన్ను కన్న ప్రేమ..”
అంతేకాదు..భార్య అలిగినప్పుడు తనకి ఇష్టమైన పాట పాడతారట భాస్కర్.
ఆమెకు ఇష్టమైన జానపదం గీతం
“చుట్టూ ముట్టూ సున్నపు గోడనట్ట నడుమ లక్క మేడ..
లక్క మేడల ఒక్కదానివి దుక్కాసీల్ల కోయెల్..
గంధం పంపు కస్తూరి పంపు గాలితోటి మేఘం పంపు..
మాయలెల్లి సిలకలతోటి మాటలు పంపవోయెల్..” పాడి వివరించారు.
చదువుకోలేని భాస్కర్.. చదువుకున్న వాళ్లలో కొందరు ఎలా దిగజారిపోతున్నారో చెబుతూ..
ఉద్యమం, పల్లె వాతావరణం, మూఢనమ్మకాల మీద అవగాహన కలిగిస్తూ సామాజిక చైతన్యం కలిగించే పాటలను కూడా తన గాత్రం ద్వారా వినిపించారు.
“చదువు రాని వాళ్ళ తీరుగా ఆలోచించి చదువుకున్న వాళ్ళు దిగజారి పోతుండ్రు..
మత్తు పానీయాలు మస్తుగా సేవించి మళ్ళీ కోలుకోని రోగాల్లో పడుతుండ్రు..
అవి మంత్రాలు మంత్రాలు అంటారు మంది నాడి పోసుకుంటారు..
ఈ మూఢనమ్మకాన్ని గుడ్డిగా నమ్మేసి నిండు ప్రాణం తీసుకుంటారు..” వంటి గీతాలను ద్వారా కూడా భాస్కర్ పల్లె గాయకుడిగా ఎంతో గుర్తింపు పొందారు.
———————————–
