Quadrant CEO Vamsi Reddy Success Story
* 11 దేశాల్లో రూ.800 కోట్లకు పైగా టర్నోవర్ గల కంపెనీకి సీఈఓ ఎలా అయ్యాడు?
* వరంగల్ యువకుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల ఇన్స్పిరేషనల్ స్టోరీ
( ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి )
ఒకప్పుడు అతడు అందరిలాగే అతి సామాన్య యువకుడు. ఎంసీఏ పూర్తి చేశాక ఉద్యోగం కోసం దాదాపు ఏడాదిన్నర ఎదురు చూశాడు.. ఎన్నో కంపెనీల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. చివరకు విప్రోలో సాధించాడు. తనను తాన్ ప్రూవ్ చేసుకునేందుకు ఎంతో శ్రమించాడు. నిరంతరం అప్ డేట్ అవుతూ ఉన్నత స్థానానికి కాదు.. కాదు.. అత్యున్నత శిఖరాలకు చేరాడు. . ఇప్పుడు 11 దేశాల్లో.. ఏకంగా 800 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కంపెనీకి సీఈఓ అతడు. అతడే వరంగల్ కు చెందిన వంశీరెడ్డి కంచరకుంట్ల. ఎంత ఎదిగినా పుట్టినగడ్డను మరచిపోలేదు. వివిధ దేశాల్లో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వంశీరెడ్డి, స్థానిక యువతను ప్రోత్సహించాలని, ఉన్న ఊరులోనే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని క్వాడ్రంట్ టెక్నాలజీస్ కంపెనీని వరంగల్ లోనూ ప్రారంభించాడు. వంశీ.. అసామాన్యుడిగా ఎదిగిన విధానంపై ఆకేరు న్యూస్ ప్రత్యేక కథనం..
* ఐటీ ఉద్యోగిగా ప్రయాణం మొదలుపెట్టి.. సొంత కంపెనీ దిశగా..
నర్సంపేట దగ్గర ముగ్దుంపురంలోని చిన్న గ్రామంలో జన్మించిన వంశీరెడ్డి.. శ్రీ గురుకుల విద్యాలయంలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకున్నారు. డిగ్రీ కేడీసీలో చదివారు. తండ్రి మురళీధర్ రెడ్డి మెడికల్ ఆఫీసర్. తల్లి మణిమాల. తండ్రి మెడికల్ ఆఫీసర్ అయినా వ్యవసాయం కూడా చేసేవారు. హైదరాబాద్ లో ఎంసీఏ చేసిన వంశీకి ఉద్యోగ అవకాశాలు అంత ఈజీగా రాలేదు. దాదాపు ఏడాదిన్నర ఎన్నో కంపెనీల చుట్టూ తిరిగారు. ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అమెరికాకు స్టడీస్ కోసం వెళ్దామని అనుకొని జీఆర్ఈ, టోఫెల్ రాశారు కానీ అప్పుడు వెళ్లలేక పోయారు. విప్రో కంపెనీలో ఐటీ ఉద్యోగిగా ప్రయాణం మొదలుపెట్టారు. తర్వాత హెచ్1 బి వీసాతో అమెరికా వెళ్లారు. అక్కడ ఫస్ట్ మైక్రోసాఫ్ట్.. తర్వాత విండోస్ లాంటి మల్టిపుల్ టీమ్స్ లో పని చేశారు. ఉద్యోగానికి స్వస్తి చెప్పి సొంతంగానే కంపెనీ పెట్టాలని భావించారు. 2016 లో క్వాడ్రంట్ టెక్నాలజీస్ పేరుతో కంపెనీ ప్రారంభించారు.
* ఏకంగా 11 దేశాలకు విస్తరణ..
అమెరికాలో కంపెనీ మొదలుపెట్టిన వంశీరెడ్డి అక్కడితో ఆగలేదు. అక్కడ హెడ్ క్వార్టర్స్ గా చేసుకుని కెనడా, మెక్సికో, కోస్టారికా, ఆస్ట్రేలియా, యూరప్, ఐర్లాండ్, దుబాయ్, సింగపూర్, మలేషియా, ఇండియా.. ఇలా 11 దేశాలకు తన కంపెనీని విస్తరించారు. ఏకంగా రూ.800 కోట్లకు పైగా టర్నోవర్ స్థాయికి తీసుకెళ్లారు. ఆ స్థాయికి కంపెనీని ఎలా విస్తరించగలిగారు అని వంశీరెడ్డిని అడిగితే.. “షార్ట్ కట్స్ వెతకకండి, తప్పులు చేయకండి. మన పర్పస్ ఏంటో దాని మీద ఫోకస్ చేస్తే ఏ ఇష్యూస్ లేకుండా తప్పకుండా టార్గెట్ రీచ్ అవ్వగలం”.. అని వెల్లడించారు.
* హైదరాబాద్.. బెంగళూరు.. చెన్నయ్ లోనే కాదు.. పుట్టిపెరిగిన ఊరిలో కంపెనీ స్థాపించాలని..
ఇతర దేశాల్లోనే కాదు.. స్వదేశంలోనూ వంశీరెడ్డి తన కంపెనీని ప్రారంభించారు. ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో స్థాపించారు. అంతేకాకుండా లోకల్ ట్యాలెంట్ ను ప్రోత్సహించాలని, తాను పుట్టి పెరిగిన వరంగల్ లోనే కంపెనీ స్థాపించాలని భావించారు. తెలంగాణ రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ లో పెట్టాలని నిర్ణయించారు. నాటి మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో మడికొండలో క్వాడ్రంట్ టెక్నాలజీస్ కంపెనీని ప్రారంభించారు. ఈ ప్రస్థానంపై వంశీరెడ్డి మాట్లాడుతూ.. “నేను వరంగల్ లోనే పుట్టి పెరిగినాను. చదువుకున్న తర్వాత అక్కడికి వెళ్ళినాము. మాలాగే చాలా మంది టాలెంట్ ఉన్నోళ్లని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాను. ఇంకొకటి ఏందంటే కేటీఆర్ గారు ఎప్పుడైనా అమెరికాకు వచ్చినప్పుడు.. మనకు డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్ కావాలి.. తెలంగాణకు గ్రోత్ కావాలి.. బంగారు తెలంగాణ కావాలంటే డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్ కావాలి అనేది. అట్లా మోటివేట్ చేస్తుండేవాడు. దీంతో మన హోమ్ టౌన్ లో ఎందుకు కంపెనీ పెట్టకూడదు అనేది ఒక ఐడియా ఉండే. దెన్ యు నో.. లోకల్ టాలెంట్ కి ఆపర్చునిటీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ కూడా స్టార్ట్ చేశా”.. అని వివరించారు.
* డెఫినెట్ గా ఇక్కడ టాలెంట్ ఉంది.. యువత అవైలబుల్ గా ఉన్నారు..
దేశ, విదేశాల్లోని ప్రముఖ నగరాల్లో భారీ ఎత్తున నడుస్తున్న కంపెనీని ఏ ధైర్యంతో వరంగల్ లో పెట్టారు.. మీ కంపెనీ అభివృద్ధికి తోడ్పడగల టాలెంట్ ఉన్న యువత ఇక్కడ ఉన్నారా అని.. ఆకేరు న్యూస్ ప్రతినిధి వంశీరెడ్డిని అడిగినప్పుడు.. “డెఫినెట్లీ అండి. ఇప్పుడు వరంగల్ లో టాలెంట్ ఉన్న యువత చాలా మంది ఉన్నారు. మనకు REC ఉంది, KITS ఉంది. కిట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆర్ఈసీ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది కంపెనీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలానే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వాగ్దేవి గానీ లేకపోతే మల్టిపుల్ ఇంజనీరింగ్ కాలేజెస్..చూస్తే మనకు ఒక ఆల్మోస్ట్ ఒక పది, పన్నెండు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో వాటిలో నుంచి వచ్చే టాలెంట్ చూసుకున్నా గానీ చాలా మంది యువత అవైలబుల్ ఉన్నారు. సో వాళ్ళు హైదరాబాద్ కు వచ్చి కష్టపడి, బెంగళూరు కు వెళ్లి కష్టపడే బదులు మన దగ్గరే ఉంది అని అనుకోండి.. వాళ్ళు ఫోర్త్ ఇయర్ లో ఉన్నప్పుడే మా దగ్గర ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయొచ్చు. సో ముందే ట్రైన్ అయిపోతారు వాళ్ళు. దెన్ ఆ ఫోర్త్ ఇయర్ కాగానే మా దగ్గర వచ్చి జాబ్ చేయొచ్చు. సో వరంగల్ లో ఉంటే ఆ అడ్వాంటేజ్ కూడా ఉంటది. సో డెఫినెట్ గా ఇక్కడ టాలెంట్ ఉంది”… అంటూ వరంగల్ లోని ఇంజనీరింగ్ ప్రాముఖ్యతను చక్కగా వివరించారు.
* అమెరికా వెళ్ళే వాళ్ళకి వంశీరెడ్డి చెబుతున్న విలువైన సూచనలేమిటంటే..
“ఏ ప్లేస్ కి వెళ్తున్నారో అక్కడి వెదర్ ఎలా ఉంటుంది.., అక్కడ రూల్స్ ఏంటి అనేది ముందే తెలుసుకోవాలి. అక్కడ లోకల్ గా మన తెలుగు ఆర్గనైజేషన్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వడం మంచిది. అలాగే మా టీటీఏ (TTA) ద్వారా కూడా మేము 1-800-TTA-SEVA అనే హెల్ప్ లైన్ రన్ చేస్తున్నాం. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, అటార్నీల సహాయం కావాలన్నా మేము అందిస్తాం.” అని భరోసా కల్పిస్తున్నారు. వందల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి సీఈఓగా ఉన్న వంశీరెడ్డి అటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా.. సహాయ సహకారాలు అందించడం నిజంగా చాలా మందికి స్ఫూర్తిదాయకం.
———————————
_________________________
