* మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు
* స్మగ్లర్లను అడ్డుకోవడంలో ఎక్సైజ్ అధికారులు, కానిస్టేబుళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది
* ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక సాయం
*ఎక్సైజ్, ప్రొహిబిషన్, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎక్సైజ్, ప్రొహిబిషన్, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జనవరి 23న నిజామాబాద్‌లో గంజాయి ముఠా వాహనాన్ని అడ్డుకునే క్రమంలో దాడికి గురై విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ తమ ఒకరోజు పెన్షన్ మొత్తాన్ని విరాళంగా సేకరించిన రూ.2.80 లక్షల చెక్కును మంత్రి జూపల్లి కృష్ణారావు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సౌమ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.1 కోటి ఆర్థిక సాయం అందించినట్లు, ఆమె సోదరుడు జి.శ్రవణ్‌కు ఎక్సైజ్శాఖలోనే జూనియర్ అసిస్టెంట్‌గా నియామక పత్రం అందజేసినట్లు గుర్తుచేశారు.స్మగ్లర్లను అడ్డుకోవడంలో ఎక్సైజ్ అధికారులు, కానిస్టేబుళ్లు చూపుతున్న ధైర్యానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు వారంలోగా 2,500 మందికి పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. మరోవైపు, నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర జాతరలో జరిగిన విషాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
