Mulugu 108 Rescue Operation
* డోలీలో రోగిని తరలించిన108 సిబ్బంది.
* 108లోప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలింపు.
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు మరోసారి బహిర్గతమయ్యాయి. గుర్రాలబావి గ్రామానికి చెందిన గోత్తికోయ గిరిజన యువకుడు మడకం అయితయ్య (18) తీవ్ర జ్వరంతో అపస్మారక స్థితికి చేరుకోగా, కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. ఈఎంటీ శివలింగం ప్రసాద్ ,పైలట్ కోటి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. అయితే గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో బురద మార్గంలో కాలినడకన వెళ్లి బాధితుడిని చేరుకున్నారు. గ్రామస్తుల సహాయంతో అతడిని డోలీపై మోసుకుంటూ ప్రధాన రహదారి వరకు తీసుకొచ్చి అంబులెన్స్‌లోకి తరలించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా, బాధితుడికి రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోవడంతో పాటు తీవ్ర జ్వరం ఉన్నట్లు గుర్తించారు. ఈఆర్సీపీ వైద్యురాలు డాక్టర్ మౌనిక సూచనల మేరకు వెంటనే అత్యవసర చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్న 108 సిబ్బంది సేవలను స్థానికులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
