ఆకేరు న్యూస్, డెస్క్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. మంగళవారం (మార్చి 3) ఉదయం ఆమె దుబాయ్ నుండి నేరుగా బెంగళూరు చేరుకున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ – 2026 కోసం సింధు తన కోచ్ ఇర్వాన్ష్యా అడి ప్రతామాతో కలిసి ప్రయాణమయ్యారు. అయితే, అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధ పరిస్థితుల కారణంగా దుబాయ్ విమానాశ్రయం ఒక్కసారిగా మూతపడింది. గగనతలం మూసివేయడంతో శనివారం నుంచి సింధు అక్కడే చిక్కుకుపోయారు.
దుబాయ్‌లో ఉన్న సమయంలో విమానాశ్రయం సమీపంలోనే పేలుళ్లు జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా భీతావహంగా మారింది. దీనిపై సింధు స్పందిస్తూ.. “గడిచిన కొన్ని రోజులు చాలా భయంకరంగా, అనిశ్చితితో గడిచాయి. క్షేమంగా ఇంటికి చేరుకోవడం ఉపశమనాన్ని ఇస్తోంది. మాకు అండగా నిలిచిన దుబాయ్ అధికారులు, ఇండియన్ ఎంబసీ మరియు ఎయిర్పోర్ట్ సిబ్బందికి కృతజ్ఞతలు” అని ఎమోషనల్ పోస్ట్ చేశారు. దుబాయ్‌లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో సింధు సరైన సమయానికి ఇంగ్లాండ్‌కు చేరుకోలేకపోయారు. దీనివల్ల ఆమె ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుని, వచ్చే వారం జరగనున్న స్విస్ ఓపెన్ (మార్చి 10-15) ద్వారా తిరిగి కోర్టులోకి అడుగుపెట్టనున్నారు. లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి, సాత్విక్-చిరాగ్ జోడీ ఇప్పటికే ఆఫ్రికా మరియు సింగపూర్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో బర్మింగ్‌హామ్ చేరుకున్నారు. నేటి నుంచే వీరు తమ మ్యాచ్‌లను ఆడనున్నారు. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో గందరగోళం నెలకొన్నప్పటికీ, భారత ప్రభుత్వం మరియు ఎంబసీ చొరవతో సింధు సురక్షితంగా వెనక్కి రావడంతో క్రీడాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
