ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిన అధికారులు..
ఆకేరు న్యూస్ , వరంగల్: సామాన్యుల పట్ల అధికారులు ఏ స్థాయిలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారో చెప్పేందుకు వరంగల్ నగరంలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. కేవలం ఇంటి పన్ను చెల్లించలేదన్న నెపంతో ఒక పేద మహిళ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ను అధికారులు ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..
వరంగల్ నగరం కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన గొలుసుల సుజాత అనే మహిళకు గత నెల 23న మున్సిపల్ అధికారులు ఇంటి పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. అయితే, నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె సకాలంలో పన్ను కట్టలేకపోయింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుజాత ఇంటికి వెళ్లిన అధికారులు, పన్ను బకాయిల గురించి ప్రశ్నించారు. తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని, కొంత సమయం కావాలని ఆమె వేడుకున్నప్పటికీ అధికారులు కనికరించలేదు.
సిలిండర్ జప్తు.. విమర్శల వెల్లువ:
పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సిబ్బంది, మానవత్వాన్ని మరిచి ఆమె వంట గదిలోని గ్యాస్ సిలిండర్ను బలవంతంగా తీసుకెళ్లారు. ఇంట్లో వంట వండుకునే ఆధారాన్ని కూడా వదలకుండా అధికారులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేసేది లేక సుజాత బయట అప్పు చేసి మరీ రూ. 5,280 పన్ను మొత్తాన్ని మున్సిపల్ కార్యాలయంలో చెల్లించింది. పన్ను కట్టిన రసీదు చూపించిన తర్వాత, సాయంత్రం వేళ అధికారులు తిరిగి ఆమె సిలిండర్ను అప్పగించారు.
ప్రభుత్వ లక్ష్యాల కోసం క్షేత్రస్థాయిలో అధికారులు ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటంపై నగరవాసులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
