సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
* పేదలకోసం ఖర్చు చేస్తాం
* కేసీఆర్ ఆ భూములను కొట్టేయాలని ప్రయత్నించాడు
* రూ.1.50 లక్షల కోట్ల భూములు రక్షించాం
* ఢిల్లీ ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy| ఆకేరు న్యూస్, డెస్క్: హైదరాబాద్‌లో మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి కీలక విజయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సుమారు రూ.50 వేల కోట్ల విలువైన ఈ భూములను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మియాపూర్ భూములను అమ్మేస్తాం .. భూముల విక్రయం ద్వారా సమకూరే నిధులను విద్యాభివృద్ధితోపాటు నీటిపారుదల, వైద్య తదితర రంగాలకు వినియోగించే అంశాన్ని మంత్రివర్గంలో చర్చిస్తామని వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మియాపూర్‌లో వివాదాస్పద భూములు ప్రభుత్వానికి చెందినవేనని నిర్ధారించిన సుప్రీంకోర్టుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు తమ ప్రభుత్వం బలమైన న్యాయవాదనలు వినిపించిందన్నారు.
* కేసీఆర్ కొట్టేయాలని చూశారు
మియాపూర్ భూములను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన బంధువు దామోదర్‌రావు, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో దామోదర్‌రావుకు విలాసవంతమైన కార్లు, కేసీఆర్‌కు నగదు రూపంలో ముడుపులు అందాయని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై తాను పోరాడానని చెప్పారు. ఆ పోరాటం కారణంగానే తనపై రాజకీయ కక్ష పెంచుకుని జైలుకు పంపించారని ఆరోపించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు కొనసాగిస్తామన్నారు.
* రూ.1.50 లక్షల కోట్ల భూములు రక్షించాం
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఐఎంజీ, కంచ గచ్చిబౌలి, మామిడిపల్లి, గుర్రంగూడ, మంచిరేవుల తదితర ప్రాంతాల్లో భూముల పరిరక్షణకు న్యాయపోరాటాలు చేసినట్లు వివరించారు. ఐఎంజీ భూముల విషయంలో భలేరావు కుటుంబంతో కలిసి కేటీఆర్ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మంచిరేవులలో 143 ఎకరాలను రక్షించామని, అక్కడ పోలీసుల పిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేశామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూములను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ప్రభుత్వ భూములను కాపాడినట్లు చెప్పారు.
* పేదల కోసం ఖర్చు చేస్తాం..
మియాపూర్ భూముల విక్రయం, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వనరుల సమీకరణకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని సీఎం తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అదే విదంగా పేదల సంక్షేమం కోసం ఈ డబ్బులను వినియోగించాలని కూడా ఆలోచిస్తున్నాం. భూముల వినియోగంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
* బీఆర్ ఎస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదు
ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. భూముల పరిరక్షణకు పనిచేసిన రెవెన్యూ అధికారులను కూడా అభినందించలేదన్నారు. భూ ఆక్రమణలపై చర్చించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు శాసనసభకు రావాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూములపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేసీఆర్, హరీశ్‌రావు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. భూముల సర్వేలను అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ మియాపూర్ భూముల చరిత్ర
* 550 ఎకరాలపై ప్రైవేటు అప్పీళ్ల కొట్టివేత
మియాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 100, 101లో సుమారు 550 ఎకరాల భూమిపై ప్రైవేటు వ్యక్తులు, హౌసింగ్ సొసైటీలు దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు అక్టోబరు 29న కొట్టివేసింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ సతీశ్ చంద్రశర్మల ధర్మాసనం ఈ నిర్ణయం వెలువరించింది. భూములపై ప్రభుత్వ యాజమాన్యాన్ని గుర్తిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2003 ఏప్రిల్ 16న ఇచ్చిన తీర్పులో జోక్యానికి కారణాలు లేవని పేర్కొంది. దీంతో హైకోర్టు తీర్పు తర్వాత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అప్పీళ్ల వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వచ్చింది
* నిజాం ఫర్మానాతో యాజమాన్య హక్కు రాదు
ఈ భూముల వివాదానికి నిజాం కాలంనాటి రికార్డులు నేపథ్యంగా ఉన్నాయి. 1912 సర్వేలో భూములు ‘సర్కారీ పోరంబోకు’గా నమోదయ్యాయి. పాయిగా కుటుంబ వారసత్వం, 1929 నాటి నిజాం ఫర్మానా, తదనంతర రెవెన్యూ నమోదుల ఆధారంగా వేర్వేరు వర్గాలు యాజమాన్య హక్కులు కోరాయి. అయితే, జాగీరు మంజూరు వల్ల భూమిపై సంపూర్ణ వ్యక్తిగత యాజమాన్యం సంక్రమించదని న్యాయస్థానం స్పష్టం చేసింది. జాగీర్ల రద్దు అనంతరం ప్రభుత్వానికి సంక్రమించిన భూములపై చెల్లుబాటయ్యే హక్కును అప్పీలుదారులు నిరూపించలేకపోయారని తేల్చింది. వివాదాస్పద రెవెన్యూ నమోదులు, తదనంతర లావాదేవీల ఆధారంగా ప్రభుత్వ భూమిపై యాజమాన్యం పొందలేరని పేర్కొంది.
* 2017లోనూ నమోదైన క్రిమినల్ కేసు
మియాపూర్ భూముల వ్యవహారం 2017లోనూ పెద్ద వివాదంగా మారింది. ప్రభుత్వ భూములను వివాదాస్పద పత్రాలు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీల ఆధారంగా కంపెనీల మధ్య బదిలీ చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అప్పట్లో క్రిమినల్ కేసు నమోదైంది. ట్రినిటీ, సువిశాల్ సంస్థల లావాదేవీలు, రిజిస్ట్రేషన్ అధికారుల పాత్ర దర్యాప్తులో ప్రస్తావనకు వచ్చాయి. తాజాగా వెలువడిన తీర్పు సర్వే నంబర్లు 100, 101లోని భూముల యాజమాన్యానికి సంబంధించిన సివిల్ అప్పీళ్లపై ఇచ్చిన నిర్ణయం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

