* ఒక కోటి పైనే బకాయిలు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
ఆస్పత్రి తెరిచినప్పుడు నుండి మూసే వరకు అన్నీ తామై సేవలందించే కాంటిన్జెన్సీ వర్కర్లకు గత 13 నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
ఆసుపత్రి, వార్డులను, బాత్రూం, వాష్ రూములను శుభ్రం చేయడం వైద్యులకి అందుబాటులో ఉండి వైద్య సేవలకు సహకరించడం కాంటిన్జెన్సీ వర్కర్ల రోజువారి పని.
* రాష్ట్రంలో 270 మంది
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో దాదాపు 270 మంది కాంటిన్జెన్సీ వర్కర్లు వివిధ స్థాయిలలో వారి సేవలను అందిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగస్తులు ప్రతినెల వేతనాలు తీసుకుంటున్నప్పటికీ కాంటిన్జెన్సీ వర్కర్లకు మాత్రం ప్రభుత్వం ప్రతి నెల వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రం లోని ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే కాంటిన్జెన్సీ వర్కర్లు వేరే పని చేయలేక వేతనాలు సకాలంలో రాక పిల్లల ఫీజులు కట్టలేక కుటుంబాలను పోషించుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
* 1 కోటి 82 లక్షల బకాయి…
ఒక్కొక్కరికి రూ. 5200/- వేతనాన్ని ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్రంలోని 270 మందికి 13 నెలల బకాయి మొత్తం కలిపి 1 కోటి 82 లక్షల 52 వేలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. చాలీచాలని జీతం గత 13 నెలలుగా అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కాంటిన్జెన్సీ వర్కర్లు వాపోతున్నారు.
* బకాయిలు చెల్లించండి, కాంటినెన్సీ వర్కర్ల రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంటిన్జెన్సీ వర్కర్లకు చెల్లించాల్సిన 13 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొలనుపాక హరిప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. రెగ్యులర్ ఉద్యోగస్తుల తోపాటు తాము కూడా సేవలు అందిస్తున్నామని మాపై ఆధారపడిన కుటుంబాలను పోషించుకునేందుకు ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
