Collector Chahat Bajpai Rythu Nestam 100th Episode
* తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేయాలి
-కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
* వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
* ఎల్కతుర్తి రైతు వేదిక నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
అకేరు న్యూస్ :హనుమకొండ
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు.
వ్యవసాయ శాఖ నిర్వహించిన ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి రైతులు, వ్యవసాయ అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు శాస్త్రీయ వ్యవసాయ విజ్ఞానాన్ని చేరవేయడంలో ‘రైతు నేస్తం’ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలని, ఆధునిక సాంకేతికత, నీటి యాజమాన్య పద్ధతులను అనుసరించాలని సూచించారు. రైతు భరోసా, రైతు బీమా పథకాలతో పాటు ఎరువుల సకాల సరఫరా కోసం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. 100వ ఎపిసోడ్ సందర్భంగా నిరంతరం కార్యక్రమానికి హాజరైన ప్రగతిశీల రైతులను సన్మానించారు.
అనంతరం *జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి* మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల కారణంగా తక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున రైతులు పెసర, కందులు, నువ్వులు, మినుములు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. రైతు వేదికల ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ నిపుణులు రైతులకు నేరుగా సలహాలు అందిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఇంకా సాగు చేయని భూములను ఖాళీగా ఉంచకుండా తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పంటల సాగు రైతులకు ఆదాయాన్ని అందించడంతో పాటు భూసారాన్ని కూడా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. రైతులకు అనువైన పంటల వివరాలను రైతు వేదికల వద్ద ప్రదర్శనల ద్వారా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ప్రగతిశీల రైతులను సన్మానించి, రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సర్పంచ్ లావణ్య, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, ఏడీఏ ఆదిరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీవో విజయ్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
