*అవకాశాలు లేని చోట కొత్త వనరులను సృష్టించడమే నా అంతిమ లక్ష్యం.
జిల్లా అభివృద్ధికి ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తాం .
రాష్ట్ర మంత్రి సీతక్క.
ఆకేరు న్యూస్,ములుగు:
ఏజెన్సీ ప్రాంతంలో అవకాశాలు లేని చోట నూతన వనరులను కల్పించడమే నా అంతిమ లక్ష్యమని, భోజనం లేని వారికి భోజనం పెట్టడం, నీడ లేని చోట చెట్టు పెట్టడం, ఇల్లు లేనివారికి ఇల్లు సౌకర్యం కల్పించడంలో వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిదని గుర్రాల బావి గ్రామంలో 20 సంవత్సరాల కల నెరవేరిందని, ఎవరూ లేని వారికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, జిల్లా అభివృద్ధికి ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం సాయంత్రం ఏటూరు నాగారం మండలం గుర్రాల బావి గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఏర్పాటుచేసిన కంటైనర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ వనరులు, అవకాశాలు లేని చోట కొత్త సౌకర్యాలను సృష్టించడమే తమ అంతిమ లక్ష్యామని పేర్కొన్నారు.అటవీ ప్రాంతాల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి అనుమతులు లేని చోట, ప్రత్యామ్నాయంగా కంటైనర్ స్కూళ్లు, హాస్పిటళ్లు మరియు అంగన్వాడీలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఈప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్న వారు 25 సంవత్సరాల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని సల్వాజుడుం ఘర్షణల వల్ల వలస వచ్చిన వారని, వారికి కనీస విద్య, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ప్రాజెక్టుకు సహకరించిన ఈసీఐఎల్ ,
సంతోష్ రామస్వామి బృందం ఏర్పాటుకు కృషి చేసిన, కలెక్టర్, ఎస్పీ, విద్యాశాఖ అధికారులను, స్థానిక యువతను మంత్రి సీతక్క అభినందించారు.
గతంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, చెట్ల కింద చదువుకునే పిల్లలకు, ఇప్పుడు సురక్షితమైన వాతావరణం కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ధనికులకు స్నేహితులు ఉంటారు, కానీ పేదవారికి ప్రభుత్వమే అసలైన చుట్టంగా వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. సేవా దృక్పథం ఉన్న అధికారులు ఉంటే సమాజంలో పేదరికం తగ్గి, అందరూ సమానంగా బతికే అవకాశం ఉంటుందని తెలిపారు. సరైన అవకాశాలు సౌకర్యాలు కల్పిస్తే ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదుగుతారని, గతంలో తాము ఏర్పాటు చేసిన స్కూల్ విద్యార్థులు ఇప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని ఉదాహరణగా చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం లో ప్రభుత్వ పాఠశాల మంజూరు అయినప్పటికీ కొన్ని కారణాల వలన నిర్మాణం కాలేదని ఇక్కడి విద్యార్థులకు పాఠశాల ఉండాలని ఉద్దేశంతో కంటైనర్ పాఠశాల ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే సదుద్దేశంతో హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ వారి సహకారంతో పాఠశాల ఏర్పాటు చేశామని తెలిపారు. సహకారం అందించిన సంస్థను కలెక్టర్ అభినందించారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుదీర్ రామ్‌నాథ్ కేకన్, ఏటూరు నాగారం ఏ ఎస్ పి మనన్ భట్,గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, డీఈవో సిద్ధార్థ రెడ్డి,ఈసీఐఎల్ సంస్థ బృందం ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
