*పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యమే ప్రజలందరి ఆరోగ్యం
*మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యమే ప్రజలందరి ఆరోగ్యమని మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు, కార్యాలయ ఉద్యోగులకు స్థానిక ఆరోగ్య శాఖ సమన్వయంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అందరికీ వైద్య పరీక్షలు చేసి, చికిత్స అవసరం ఉన్న వారిని జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయాలన్నారు. అవసరం ఉన్నవారికి కౌన్సిలింగ్ ఇచ్చి, మందులు పంపిణీ చేయాలని కోరారు. పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది అందరూ ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విధి నిర్వహణలో భాగంగా తరచుగా పలు రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వీరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ నీల రాజమ్మ గట్టయ్య, కమీషనర్ రాధాకృష్ణ కౌన్సిలర్లు గట్టు సంగీత రమేష్, చౌదర్పల్లి సంపత్ రాజు, గుర్రం హరినాథ్, గుర్రం హైమా, పొన్న రవి, డాక్టర్లు శ్రీవాణి, రుబీనా, హస్నా, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
