* విద్యార్థులు భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని
* ఎంపీ కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి విద్యార్థులు తమ భవిష్యత్తును ఉజ్వలంగ తీర్చిదిద్దుకోవాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీహరిలు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం రూపొందించిన 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన బ్రోచర్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండ కనకదుర్గ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ కావ్య మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ కళాశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
*ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఉచిత కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు వంటి సదుపాయాలు విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరి మంచి అవకాశాలను పొందాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, టీఎస్కేసీ ద్వారా ఉద్యోగావకాశాల కల్పన, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, పోటీ పరీక్షల మార్గదర్శకత్వం వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బత్తిని చంద్రమౌళి అధ్యాపకులు నాగరాజు, సుమలత, అఖిల తదితరులు పాల్గొన్నారు.
