* హనుమకొండలో ప్రపంచ అటవీ దినోత్సవం
* ప్రకృతిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే
* పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత- హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
* అడవుల రక్షణపై భారీ బైక్ ర్యాలీ
ఆకేరు న్యూస్, హనుమకొండ:
ప్రకృతిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనని, పర్యావరణ సమతుల్యతలో అడవుల పాత్ర వెలకట్టలేనిదని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పేర్కొన్నారు. శనివారం మార్చి 21 ‘ప్రపంచ అటవీ దినోత్సవం’ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ, హనుమకొండ జిల్లా యంత్రాంగం మరియు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కాకతీయ జూలాజికల్ పార్క్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

హోరెత్తిన బైక్ ర్యాలీ
అడవుల ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు జిల్లా అటవీ శాఖాధికారి (DFO) బి. లావణ్య ఆధ్వర్యంలో సుబేదారిలోని ఫారెస్ట్ కాంప్లెక్స్ నుండి కాకతీయ జూలాజికల్ పార్క్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అధికారులు, అటవీ సంరక్షణపై నినాదాలు చేస్తూ నగరవాసులను ఆకట్టుకున్నారు.
ఇంటి నుండే పర్యావరణ సేవ: కలెక్టర్ పిలుపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. అడవులను కాపాడటం అంటే కేవలం అడవిలోకి వెళ్లడం మాత్రమే కాదని, మన నిత్య జీవితంలో చిన్నపాటి మార్పులతో పెద్ద ఫలితాలను సాధించవచ్చని తెలిపారు.
మొక్కలే ప్రాణాధారం: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని సూచించారు.
జీవవైవిధ్యం: వేసవి కాలం దృష్ట్యా పక్షులు, మూగజీవాల కోసం మిద్దెలపై, ఇంటి ముందర మట్టి పాత్రల్లో నీరు, ఆహారం ఉంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు.
భావి తరాల కోసం: అడవుల నరికివేత వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, పచ్చదనాన్ని పెంచడం ద్వారానే గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలను అరికట్టగలమని ఉద్ఘాటించారు.
ఉత్సాహంగా సాగిన పోటీలు – విజేతలకు బహుమతులు
ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం వంటి వివిధ పోటీలను నిర్వహించారు. అటవీ సంరక్షణపై విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభను కలెక్టర్ అభినందించారు. అనంతరం విజేతలకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ వేడుకల్లో అసిస్టెంట్ క్యూరేటర్ బి. మయూరి, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు ఇందారం నాగేశ్వర్ రావు, చెలుపూరి శ్యామ్ సుందర్, పిట్టల రవి బాబు పాల్గొన్నారు. అలాగే కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిప్పని రాధిక, జూ పార్క్ సెక్షన్ ఆఫీసర్లు సురిదాస్, శివ కుమార్, బీట్ ఆఫీసర్లు శారద, శ్వేత, సురేష్తో పాటు అటవీ శాఖ సిబ్బంది మరియు పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
