ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం ఎంతలా పెరిగిందో, దాని ద్వారా పొంచి ఉన్న ముప్పులు కూడా అంతే స్థాయిలో పెరిగాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. ముఖ్యంగా యువతులు, విద్యార్థినులు సోషల్ మీడియా వినియోగంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
పరిచయం ప్రాణసంకటం కావొచ్చు!
సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్‌లలో అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల పట్ల అజాగ్రత్తగా ఉండవద్దని సజ్జనార్ సూచించారు.
గుడ్డిగా నమ్మకండి: కేవలం డీపీ (ప్రొఫైల్ పిక్చర్) చూసి లేదా వారు మాట్లాడే తీపి మాటలను నమ్మి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దు.
వ్యక్తిగత సమాచారం: అపరిచితులతో చాటింగ్ చేయడం వల్ల మన బలహీనతలు వారికి తెలిసే అవకాశం ఉంది. ఇది చివరికి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంది.
బ్లాక్‌మెయిలింగ్ ఉచ్చు.. జాగ్రత్త!
అపరిచితులు ముందుగా స్నేహం నటించి, ఆ తర్వాత నమ్మకాన్ని చూరగొని పర్సనల్ ఫొటోలు లేదా వీడియోలు సేకరిస్తారని సీపీ వివరించారు.
“ఒక్కసారి మీ వ్యక్తిగత ఫొటోలు వారి చేతికి చిక్కాయంటే, ఇక మీ జీవితం వారి చేతుల్లో ఉన్నట్లే. ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతారు. దీనివల్ల యువతులు మానసిక వేదనకు గురై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యువతకు సీపీ సజ్జనర్ సూచనలు…
ప్రైవసీ సెట్టింగ్స్: మీ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ మోడ్‌లో ఉంచుకోండి. కేవలం తెలిసిన వారికి మాత్రమే మీ సమాచారం కనిపించేలా చూసుకోంది.
అపరిచితులకు నో: తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడటం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం పూర్తిగా మానుకోవాలి.
పోలీసులను ఆశ్రయించండి: ఎవరైనా మిమ్మల్ని ఆన్లైన్లో వేధిస్తున్నా లేదా బ్లాక్మెయిల్ చేస్తున్నా భయపడకుండా వెంటనే ‘షీ టీమ్స్’ (She Teams) లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి.
సాంకేతికతను సమాచారం కోసం వాడుకోవాలే తప్ప, అది మన జీవితాలను చిన్నాభిన్నం చేసేలా ఉండకూడదని సజ్జనార్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సోషల్ మీడియా యాక్టివిటీస్‌పై ఒక కన్నేసి ఉంచాలని ఆయన కోరారు.
