*మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: చారిత్రాత్మక హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు’పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శాసనమండలిలో అత్యంత స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కారణంగా పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఏ ఒక్కరూ నిరాశ్రయులు కాకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని, బాధితులకు గతంలో కంటే మెరుగైన వసతులతో కూడిన పునరావాసం కల్పిస్తామని ఆయన ప్రకటించారు.
మానవీయ కోణంలో పునరావాసం – అఖిలపక్ష సూచనలకు ఆహ్వానం
శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన సందేహాలకు సమాధానమిస్తూ, మూసీ ప్రక్షాళనను రాజకీయ కోణంలో చూడవద్దని ముఖ్యమంత్రి కోరారు.
బాధ్యతాయుత పునరావాసం: మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ ఆదుకునే పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరికీ నష్టం జరగకుండా, వారి జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకుంటాం.
మంత్రివర్గ ఉప సంఘం: ఈ ప్రాజెక్టుపై నిర్మాణాత్మక సలహాలు, సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తామని వెల్లడించారు.
*తెలంగాణ రైజింగ్ 2047: భవిష్యత్ ప్రణాళిక ఇదే!
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం “తెలంగాణ రైజింగ్ (Telangana Rising 2047)” పేరుతో ప్రభుత్వం ఒక బృహత్తర దార్శనికతను రూపొందించింది. లక్ష చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికను రూపొందించారు.
*రాష్ట్ర విభజన – అభివృద్ధి సూత్రం (CURE, PURE, RARE)..
రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేసేందుకు మూడు విభిన్న జోన్లుగా విభజించి అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు..
కోర్ అర్బన్ రీజియన్ (Core Urban): ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న 1.34 కోట్ల జనాభా ప్రాంతాన్ని కాలుష్య రహిత సర్వీస్ సెక్టార్‌గా మార్చడం.
కాలుష్య నియంత్రణ: కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ జోన్ పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించడం. దీనికోసం హిల్ట్ (HILTP) పాలసీని అమలు చేస్తూ, ఆ భూములను మల్టీయూజ్ జోన్లుగా మార్చి మధ్యతరగతి నివాస ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాం.
గోదావరి జలాలతో మూసీకి జలకళ: 20 టీఎంసీల గోదావరి నీటిని తరలించి, అందులో 17 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, మిగిలిన నీటిని మూసీలో నిరంతరం ప్రవహించేలా చేసి నదికి పూర్వవైభవం తెస్తాం.
*ఇతర నగరాల అనుభవాల నుంచి పాఠాలు
దేశంలోని ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ (కాలుష్యం), ముంబై (వర్షాల వల్ల స్తంభన), బెంగళూరు (ట్రాఫిక్ జామ్‌లు), చెన్నై (వరదలు) ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
“హైదరాబాద్ ఒకప్పుడు లేక్ అండ్ రాక్ సిటీగా పేరుగాంచింది. కులీకుతుబ్ షాహీల కాలం నుంచి నిర్మించిన అద్భుత కట్టడాలు మనకు గర్వకారణం. కానీ నేడు మానవ తప్పిదాల వల్ల నగరం కాలుష్యం, ట్రాఫిక్ సమస్యల్లో చిక్కుకుంది. నల్గొండ ప్రజల ఫ్లోరోసిస్ కష్టాలను, మూసీ కాలుష్య ఆవేదనను చూసిన వారెవరూ ఈ ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన చేయరు.” అని ముఖ్యమంత్రి భావోద్వేగంగా పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను కేవలం ఫార్మా రాజధానిగానే కాకుండా, ప్రపంచంలోనే అత్యుత్తమ ‘లివబుల్ సిటీ’ గా (నివసించడానికి యోగ్యమైన నగరం) నిలబెట్టడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన ఆపడానికి కాకుండా, దీనిని మరింత వేగంగా, సమర్థవంతంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో సూచనలు ఇవ్వాలని సభాపక్షాలను కోరారు.
