* ప్రారంభ దశలో గుర్తిస్తే మందులతో నయం
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రస్తుత పరిస్థితుల్లో కీళ్లవాతం అనేది ప్రతి ఒక్కరి సమస్యగా మారింది. చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య పరమైన సూచనలను ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ విఘ్నేష్ ఆకేరు న్యూస్‌కు కు వివరించారు. కీళ్ల వాతానికి పురుషులు, మహిళలు అనే తేడా లేదు.. అన్ని వయసుల వారు బాధితులే. ముఖ్యంగా మహిళల్లో అధికంగా కనిపిస్తున్నది.. 50 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో బొక్కలు అరగడం, మెత్తబడడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతాయని డాక్టర్ విఘ్నేష్ పేర్కొన్నారు.
వివరాలు ఆయన మాటల్లోనే..
– రూమటాలజీ అనేది కీళ్ల వ్యాధులకు సంబంధించిన విభాగం. మన శరీరంలో వందకు పైగా కీళ్ళు ఉంటాయి. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis), యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే గౌట్ (Gout), వెన్నెముకకు సంబంధించిన యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ (Ankylosing Spondylitis), చర్మ వ్యాధులతో వచ్చే సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటివి ఉంటాయి. ఎముకల బలహీనత (Osteoporosis) కూడా ఇందులో భాగమే.
ఆర్థోపెడిక్ అనేది సర్జికల్ విభాగం. రూమటాలజీ అనేది కంప్లీట్ మెడికల్ విభాగం. అంటే ఎముక విరిగినా లేదా సర్జరీ అవసరమైనా ఆర్థోపెడిక్ డాక్టర్ వద్దకు వెళ్తారు. కానీ కీళ్ళ నొప్పులు, వాపులు, కీళ్ళు బిగుసుకుపోవడం వంటి వాటికి మెడిసిన్ ద్వారా చికిత్స చేసేది రూమటాలజిస్ట్. కీళ్ల వాతంలో ఆపరేషన్ చివరి దశలో మాత్రమే అవసరమవుతుంది.
కీళ్ల వాతం రావడానికి ప్రధాన కారణం ‘ఆటో ఇమ్యూనిటీ’ (Auto-immunity). మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి, బయటి వైరస్ లేదా బ్యాక్టీరియాపై పోరాడవలసింది పోయి, పొరపాటున మన శరీర భాగాలపై (ముఖ్యంగా కీళ్ళపై) దాడి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఫలితంగా కీళ్ల వాపు, నొప్పి పెరుగుతుంది.
కీళ్ల వాతం అనేది ముసలివాళ్లకే వస్తుందనుకుంటారు. ఇది తప్పుడు అభిప్రాయం. కీళ్ల వాతానికి వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లల నుండి ముసలివాళ్ల వరకు ఎవరికైనా రావచ్చు. యూరిక్ యాసిడ్ లేదా వెన్నెముక సమస్యలు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వ్యాధి లక్షణాలు
ప్రధానంగా ఉదయం నిద్రలేవగానే కీళ్ళు బిగుసుకుపోవడం (Morning stiffness), అంటే ఒక అరగంట లేదా గంట సేపు కీళ్ళు కదలకపోవడం ముఖ్య లక్షణం. అలాగే కీళ్లలో వాపు, ఎర్రగా మారడం, కీళ్లు వంకర్లు తిరగడం వంటివి కనిపిస్తాయి. కొన్నిసార్లు ఊపిరితిత్తులు లేదా కళ్ళపై కూడా దీని ప్రభావం ఉండవచ్చు.
వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే మందులతో పూర్తిగా నియంత్రించవచ్చు. కొంతమందికి కొంత కాలం తర్వాత మందులు తగ్గించే అవకాశం ఉంటుంది. సొంత నిర్ణయాలతో మందులు ఆపేయకూడదు. అలా చేయడంవల్ల కిడ్నీలు లేదా లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
