* సహజమైన ఫేస్ ప్యాక్‌లు మేలు
ఆకేరు న్యూస్, హనుమకొండ : ఎండలు ముదురుతున్నాయి. గతంలోకంటే వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. భానుడి ధాటికి చర్మం కమిలిపోతుంది. జిడ్డుగా మారుతుంది. పొడిబారుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ అశ్విని గుత్తేదార్ పేర్కొన్నారు. రసాయనాలతో కూడినవి కాకుండా సహజమైన ఫేస్ ప్యాక్ లు వినియోగించడం మంచిదని బ్యూటీషియన్ నిపుణులు సైతం సూచిస్తున్నారు. వివరాలు వారి మాటల్లోనే..
– ఎండల వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అయి చర్మం జీవం కోల్పోయినట్లు కనిపిస్తుంది. అందుకే రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పుచ్చకాయ వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.
– ఇంటి నుంచి బయటకు వెళ్లే 20 నిమిషాల ముందు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను ముఖం, చేతులకు రాసుకోవాలి. ఇది ట్యాన్ అవ్వకుండా కాపాడుతుంది.
– చెమట, ధూళి కారణంగా శరీరంపై ఉన్న రంధ్రాలు మూసుకుపోతాయి. రోజుకు కనీసం రెండు సార్లు చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. మైల్డ్ ఫేస్ వాష్ వినియోగించాలి.
– ఎండాకాలంలో చర్మం జిడ్డుగా ఉంటుందని చాలామంది క్రీములు మానేస్తారు. అయితే.. వాటర్ బేస్డ్ లేదా జెల్ మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
సహజమైన ఫేస్ ప్యాక్‌లు :
*అలోవెరా (కలబంద) వాడడం వల్ల ఎండ వేడి కారణంగా వచ్చిన మంటను తగ్గిస్తుంది.
*శనగపిండి, పెరుగు, టమాటా పేస్ట్ ముఖానికి పట్టించడం వల్ల ట్యాన్ తొలగించి చర్మాన్ని తెల్లగా, నల్లని మచ్చలు లేకుండా చేస్తుంది.
*ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టిస్తే అధిక జిడ్డును తొలగిస్తుంది.
చర్మతత్వాన్నిబట్టి ..
జిడ్డు చర్మం అయితే : వేసవిలో జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు, బ్లాక్ హెడ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. జిడ్డును వదిలించడానికి సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ మంచిది. రోజుకు 2-3 సార్లు ముఖం కడుక్కోవాలి. నూనె తక్కువగా ఉండే (Oil-free) లేదా జెల్ రూపంలో ఉండే మాయిశ్చరైజర్ మాత్రమే వినియోగించాలి. వారానికి రెండుసార్లు ముల్తానీ మట్టిని రోజ్ వాటర్ తో కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఇది అదనపు జిడ్డును పీల్చేస్తుంది. చర్మం రంధ్రాలు మూసుకుపోకుండా వారానికి ఒకసారి మైల్డ్ స్క్రబ్ చేయాలి.
పొడి చర్మం అయితే : ఎండ కారణంగా చర్మం పొడిగా ఉన్నవారికి చర్మం పగిలినట్లుగా లేదా దురదగా అనిపిస్తుంది. చర్మంలోని తేమను పోగొట్టని మైల్డ్ ఫేస్ వాష్ వాడాలి. సోపులు తక్కువగా వాడితే మంచిది.
హెవీ మాయిశ్చరైజర్: ముఖం కడుక్కున్న వెంటనే మాయిశ్చరైజర్ రాయడం వల్ల తేమ చర్మంలోనే ఉంటుంది. ఒక స్పూన్ పెరుగులో కొంచెం తేనె కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగితే చర్మం మృదువుగా ఉంటుంది. ముఖం కడుక్కోవడానికి గోరువెచ్చని లేదా చల్లని నీటిని మాత్రమే వాడాలి. వేడి నీళ్లు చర్మాన్ని మరింత పొడిబారుస్తాయి.
ఇంట్లో తయారు చేసుకునే న్యాచురల్ ఫేస్ ప్యాక్ లు
జిడ్డు చర్మం : ముల్తానీ మట్టి – రోజ్ వాటర్ ప్యాక్
తయారీ విధానం : 1 స్పూన్ ముల్తానీ మట్టి, సరిపడా రోజ్ వాటర్ తీసుకోవాలి. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
పొడి చర్మం : పెరుగు – తేనె – శనగపిండి ప్యాక్
తయారీ విధానం : 1 స్పూన్ పెరుగు, అర స్పూన్ తేనె, 1 స్పూన్ శనగపిండి తీసుకుని మూడింటిని బాగా కలిపి మిశ్రమాన్ని ముఖానికి రాసి 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ఎండవల్ల వచ్చే నలుపు తగ్గడానికి : కాఫీ – పంచదార – నిమ్మరసం
తయారీ విధానం : 1 స్పూన్ కాఫీ పొడి, అర స్పూన్ పంచదార, కొన్ని చుక్కల నిమ్మరసం తీసుకుని అన్నీ కలిపి ముఖంపై మెల్లగా మసాజ్ చేస్తూ రాయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఏ ఫేస్ ప్యాక్ అయినా వారానికి రెండు సార్లు మాత్రమే వాడితే మంచిది.
