ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతకుంట్ల నరేందర్ రెడ్డి (70) అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య విజయలక్ష్మి ఇద్దరు కూతుళ్లు దివ్య, దీపికలు ఉన్నారు. చింతకుంట్ల నరేందర్ రెడ్డి మృతి పట్ల వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలతోపాటు పలువురు కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ, సిపిఎం నాయకులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.
* కడియం దిగ్భ్రాంతి..
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతకుంట్ల నరేందర్ రెడ్డి మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నియోజకవర్గ సీనియర్ నాయకులు, మార్కెట్ మాజీ చైర్మన్, అత్యంత అప్త మిత్రుడైన చింతకుంట్ల నరేందర్ రెడ్డి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. సోమవారం ఆసుపత్రికి వెళ్లి నరేందర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నానని తెల్లవారేసరికే ఇంతటి విషాదకర వార్తను విని నమ్మలేకపోతున్నానని అన్నారు. గత 30 ఏళ్ల నా రాజకీయ జీవితంలో అన్నివేళలా నా వెంటే ఉంటూ నాకు అండగా నిలిచిన చిరకాల మిత్రున్ని కోల్పోవడం అత్యంత బాధాకరమని కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

* రెండు సార్లు మార్కెట్ చైర్మన్ గా
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీల కార్యకర్తగా నియోజకవర్గ నాయకుడిగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న నరేందర్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కు రెండు పర్యాయాలు చైర్మన్గా పనిచేశారు.1997 నుండి 2000 సంవత్సరం వరకు రెండుసార్లు తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సమయంలో తాటికొండ శ్రీనివాస్, గట్టు కిషన్, బుర్ర వెంకటేశ్వర్ల తో పాటు పలువురిని మార్కెట్ సిబ్బందిగా నియమించారు.
* మూడుసార్లు ఓటమి
నియోజకవర్గ నాయకుడిగా నాయకులు, కార్యకర్తల తలలో నాలుకల ఉన్న నరేందర్ రెడ్డి మూడు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మొదటిసారి 1988 లో స్టేషన్ ఘన్ పూర్ సర్పంచ్ ఎన్నికల్లో గట్టు చేరాలు చేతిలో ఓటమి చెందారు. 2010లో కొత్తపల్లి ఎంపీటీసీగా పోటీ చేసి భేతి జైపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో నమిలిగొండ ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసి పులి యాకయ్య చేతిలో ఓటమి చెందారు.
* మూడు పార్టీలు పనిచేశారు
టిడిపి ఆవిర్భావం నుండి బొజ్జపల్లి రాజయ్య, కడియం శ్రీహరి లతో కలిసి సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసే ఆ పార్టీ అధినేత చంద్రబాబు గుర్తించే స్థాయికి ఎదిగాడు. అనంతరం తెలంగాణ ఉద్యమం సందర్భంలో టిడిపిని వదిలి టిఆర్ఎస్ లో చేరారు. అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య తో కలిసి టిఆర్ఎస్ లో క్రియాశీల నాయకుడిగా పని చేశారు. ప్రస్తుతం కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆయన అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి జిల్లా నాయకుడిగా పనిచేస్తున్నారు.
* కుటుంబ సభ్యులను పరామర్శించిన కడియం, రాజయ్య
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతకుంట్ల నరేందర్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య నరేందర్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటించారు. వీరితోపాటు మున్సిపల్ చైర్మన్ తాడికొండ వినయ్, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, కౌన్సిలర్లు వివిధ పార్టీల నాయకులు నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటించారు.

