ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జీవశాస్త్రం విస్తృత పరిధి కలిగి ఉందని, భవిష్యత్లో అద్భుత అవకాశాలు కల్పిస్తుందని, నేటి తరం విద్యార్థులు ఈ అవకాశాలు వినియోగించుకోవాలని కాకతీయ విశ్వవిద్యాలయ వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ వి.ప్రణీత అన్నారు. పిఎంఎస్ హెచ్ఆర్ఐ తెలంగాణ మోడల్ స్కూల్ (స్టేషన్ ఘన్ పూర్ )లో గురువారం జరిగిన “కెరీర్ గైడెన్స్ మరియు కౌన్సెలింగ్” సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రణీత మాట్లాడుతూ జీవశాస్త్రంలో వివిధ శాఖల్లోని అవకాశాల గూర్చి విశదీకరించారు. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జీవశాస్త్రంలో కొత్త కొత్త ఆవిష్కరణలు రాబోతున్నాయని అన్నారు. నూతన పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుందని వాటి ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని వివరించారు. చిన్న వయసులో విద్యార్థులు తమ కెరీర్ పై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో సులువుగా లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు సయిరా బేగం ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
