* తాజాగా ఎస్.ఐ సురేష్‌పై సస్పెన్షన్ వేటు
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇటీవల కాలంలో వరుస వివాదాలకు, అధికారుల సస్పెన్షన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ అంటేనే ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు భయపడే పరిస్థితి నెలకొంది.
తాజా ఘటన:
మిల్స్ కాలనీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం. సురేష్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు సహకరించడం, కేసుల నమోదులో నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది.
గతంలో జరిగిన ఘటనలు..
– సీఐ వెంకటరత్నం గత ఏడాది మే నెలలో సస్పెన్షన్ కు గురయ్యారు. ఒక భూ వివాదంలో నిందితులకు సహకరిస్తూ, 9 ఏళ్ల క్రితమే మరణించిన వ్యక్తిపై తప్పుడు కేసు నమోదు చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే ఒక హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను పోలీస్ స్టేషన్ ఆవరణలోనే లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనపై వేటు పడింది.
– ఎస్సై శ్రీకాంత్‌పై గత ఏడాది ఆగస్టులో అట్రాసిటీ కేసు నమోదైంది. అర్ధరాత్రి సమయంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఒక దళిత మహిళపై దాడి చేసిన ఆరోపణలతో ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
– ఇన్ స్పెక్టర్ రమేష్ పై 2025 నంబర్లో సస్పెన్షన్ వేటు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా ఇన్స్పెక్టర్ రమేష్, కానిస్టేబుల్ రఘులను కూడా సస్పెండ్ చేశారు.
రాజకీయ జోక్యం అధికం
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో మిల్స్ కాలనీ స్టేషన్ ప్రస్తుతం అత్యంత వివాదాస్పదమైనదిగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ అధికారులపై స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దానికి తలొగ్గిన అధికారులు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు నేర నియంత్రణలో మంచి పేరున్న ఈ స్టేషన్, వరుసగా అధికారులు సస్పెండ్ అవుతుండటంతో కమిషనరేట్ పరువు పోతోందనే విమర్శలు వస్తున్నాయి. వరుస సస్పెన్షన్ల నేపథ్యంలో, ఉన్నతాధికారులు ఈ స్టేషన్ పనితీరుపై ప్రత్యేక నిఘా ఉంచారు.
