*పూజారి కుమారుడికి తీవ్ర గాయాలు
*నాసిరకం పనులపై విమర్శలు
ఆకేరు న్యూస్, హనుమకొండ :
మేడారం జాతరలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనుల్లో డొల్లతనం తేటతెల్లమైంది. తరతరాలకు గుర్తుండేలా రూ.101 కోట్లతో పనులు చేపట్టామని చెప్పిన గొప్పలు రాతి కట్టడాలు కూలుతున్న తీరుతో బహిర్గతమవుతున్నాయి. జాతరకు ముందు హడావుడిగా చేపట్టిన పనులను ఆ తర్వాత పట్టించుకున్న వారే లేకుండా పోయారు. నిర్మాణాలు ఎప్పుడు ఎవరిపై కూలిపోతాయే తెలియని పరిస్థితి నెలకొంది. నాసిరకం పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
*పూజారి కుమాడుడికి గాయాలు
గద్దెల ప్లాట్‌ఫారాల సమీపంలో నిర్మించిన రాతి కట్టడం బుధవారం కూలిపోవడంతో సమ్మక్క పూజారి సిద్ధబోయిన రమేష్ ఎనిమిదేళ్ల కుమారుడు యువిన్ (విక్కీ) తీవ్రంగా గాయపడ్డాడు. రమేష్ తన కుమారుడితో కలిసి వన దేవతల గద్దెల వద్దకు చేరుకున్నాడు. తండ్రి పూజల్లో నిమగ్నమై ఉండగా, విక్కీ గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన రెయిలింగ్ లాంటి నిర్మాణంపైకి ఎక్కాడు. ఈ క్రమంలో బాలుడు కింద పడిపోగా, ఒక పెద్ద రాయి నేరుగా అతని కాలుపై పడి ఎముకలను నుజ్జునుజ్జు చేసింది. అక్కడున్నవారి సహకారంతో బాలుడిని హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
*జాతర ముగిసిన వారం రోజులకే..
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మహా జాతర ముగిసిన వారం రోజులకే ఆలయ ప్రాంగణం, గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కట్టడాలు విరిగిపోయాయి. సమ్మక్క గద్దె చుట్టూ ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా వెదురు బొంగు ఆకారంలో చెక్కిన రాతి కట్టడాలు, వాటిపై ఉన్న దిమ్మెలు నేలకొరిగాయి. ఇప్పుడు తిరిగి అలాంటి సంఘటన పునరావృతం కావడం, బాలుడు తీవ్రంగా గాయపడడం అధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దంపడుతోంది. గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా అమర్చిన రాతి శిలలు సరిగ్గా ఫిక్స్ కాకపోవడంతో కూలిపోతున్నట్లు తెలుస్తున్నది.
*బాధ్యులపై చర్య తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం మేడారం అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకం నిర్మాణాలు చేపడుతున్నారు. విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేడారం అర్చక సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు డిమాండ్ చేశారు.
