* అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి
ఆకేరు న్యూస్, హనుమకొండ :
తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రధాన్యత ఇస్తున్నది.. పేదల విద్య , వైద్యం విషయంలో ఒక్క రూపాయి కూడా కోత విధించం.. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు.
తెలంగాణ అసెంబ్లీలో గురువారం జరిగిన సమావేశాల్లో ఆయన ముఖ్యంగా విద్య, వైద్య రంగంపై వెచ్చిస్తున్న నిధులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు తదితర అంశాలపై వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిల కారణంగా ప్రవైట్ ఆస్పత్రులు మూత పడుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టిందని చెప్పారు. తమ ప్రభుత్వం 2023 డిసెంబర్ 8 నాటి వరకు రూ. 2408 కోట్లు ఆరోగ్య శ్రీ కోసం వెచ్చించిందని, ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ. 927 కోట్ల, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1480 కోట్లు చెల్లించామన్నారు. ఈ రోజు వరకు ఉన్న బకాయిలు రూ.727 కోట్లు మాత్రమే .. ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతున్నాని తెలిపారు.
* సీఎం సహాయ నిధి ఆన్లైన్లోకి..
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల విషయంలో గతంలో అనేక అవకతవకలు జరిగాయి..
కొంత మంది ఈ నిధిని దుర్వినియోగం చేశారు.. మా ప్రభుత్వం వచ్చాక ఆన్ లైన్లో సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దీని వల్ల అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని వివరించారు. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2046 కోట్లు ఇచ్చామని వివరించారు.
పేదల వైద్యానికి రూ.4,500 కోట్లు ..
మా ప్రభుత్వం పేదల వైద్యానికి రూ.4,500 కోట్లు ఇచ్చిందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయి.. టీచింగ్ కాలేజీలకు రోగులురావడం లేదు.. పేదలు వైద్యం కోసం వెళ్లే దగ్గర సరైన డాక్టర్లు లేరు. ఆరోగ్య శ్రీ రోగులను టీచింగ్ కాలేజీలకు పంపించే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నూ ఈ ఆస్పత్రులకు ఇస్తామని, దీనివల్ల ఆస్పత్రుల నిర్వహణ మెరుగు పడుతుందని తెలిపారు. నిర్వహణ బాధ్యతలను గ్రూప్ వన్ అధికారికి ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ఇందిరమ్మ జీవిత బీమా..
కులగణనలో భాగంగా చేసిన జనగణన ఆధారంగా కోటీ 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా ఇవ్వబోతున్నామని, దీని వల్ల ప్రతీ కుటుంబానికి ధీమా కలుగుతుందని సీఎం తెలిపారు.
డాక్టర్లకు ప్రత్యేకంగా వెబ్ సైట్
మన వాళ్లు వేల మంది డాక్టర్లు విదేశాల్లో పనిచేస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ తయారు చేస్తున్నామని, వారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆస్పత్రుల్లో సేవలు అందించడానికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ ద్వారా వెబ్ సైట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
స్పెషలైజేషన్ ఆస్పత్రులు
వరంగల్, అల్వాల్, ఎల్ బీ నగర్, సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రులను స్పెషలైజేషన్ ఆస్పత్రులుగా మారుస్తున్నామని, ఆరోగ్య శ్రీ, సీఎం రీలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చే నిధులను ఈ ఆస్పత్రులకు కేటాయిస్తామని తెలిపారు.
రూ.3000 కోట్లతో ఉస్మానియా కొత్త ఆస్పత్రి..
గోషామహల్ లో 30 ఎకరాల్లో రూ.3000 కోట్లతో ఉస్మానియా కొత్త ఆస్పత్రిని నిర్మిస్తున్నామని,
అదనంగా 10 వేల పడకలు రోగుల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సీఎం చెప్పారు.
టిమ్స్ ఆస్పత్రుల పనుల్లో వేగం పెంచామని, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ వస్తున్నట్లు వివరించారు. వైద్యంలో నిరంతరం కొత్త సవాళ్లు ఎదురవుతాయి.. వైద్య ఆరోగ్య శాఖ సవాల్ లాంటిది..
భవిష్యత్తులో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నాం.. సభ్యులు ఇచ్చే సలహాలను స్వీకరిస్తామని అన్నారు.
