* సబ్ డివిజన్ ఆఫీస్ ముందు ఆర్టిసన్, ఆన్ మ్యాన్డ్ కార్మికుల ధర్నా
ఆకేరు న్యూస్ స్టేషన్ ఘన్ పూర్:
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిసన్, ఆన్ మ్యాన్డ్ పీస్‌రేట్ వర్కర్లు, స్పాట్ బిల్లర్లు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు గురువారం స్టేషన్ ఘనపూర్ విద్యుత్ సంస్థ డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. శ్రమదోపిడిని వెంటనే ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్యుత్తు కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, అన్ మ్యాన్ కార్మికులను పర్మినెంట్ చేసి విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని, ఆర్టీషన్ కార్మికుల అర్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలనే ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తాము 20-25 ఏళ్లుగా ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ తగిన జీతభత్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉద్యోగులు చేసే పనినే తాము తక్కువ జీతాలతో చేయాల్సి వస్తోందని అన్నారు. సబ్స్టేషన్లలో నలుగురు చేయాల్సిన పనిని ఒకరితో చేయిస్తున్నారని, ఆన్ మ్యాన్డ్ వర్కర్లు లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ పనులు కూడా చేస్తున్నారని తెలిపారు.
ఆర్టిసన్ వ్యవస్థను రద్దు చేసి అందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చాలని, ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 30న, వచ్చే నెల 7న మహాధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని కార్మికులు పాల్గొన్నారు.
