ఆకేరు న్యూస్, హనుమకొండ : పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకుని డొమెస్టిక్ (డొమెస్టిక్) సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో అక్రమంగా వాడుతుండటంతో అధికారులు దాడులు ముమ్మరం చేశారు.
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో సిలిండర్ల కొరత కారణంగా చాలా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్నాయి. గృహ అవసరాలకు కేటాయించిన సబ్సిడీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడంపై అధికారులు నిఘా పెంచారు. శుక్రవారం వరంగల్లోని ఒక ప్రముఖ టిఫిన్ సెంటర్ పై ఆకస్మిక దాడి చేసి, అక్రమంగా వాడుతున్న 9 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
హన్మకొండ హంటర్ రోడ్డులోని పలు హోటళ్లపై జిల్లా సరఫరా విభాగం అధికారులు దాడులు చేసి ఇక్కడ సుమారు 24 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. నర్సంపేట లో చేపట్టిన తనిఖీల్లో నర్సంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్సా, ఎస్ఐ లు రవి కుమార్, అరుణ్, సివిల్ సప్లైస్ డి.టీ సంధ్యా రాణి పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచినా లేక బ్లాక్ మార్కెట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు.
