*స్టూడెంట్ గెటప్‌లో వచ్చి
*రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి:
ఖాకీ యూనిఫామ్ వేస్తేనే కాదు.. సామాన్యుల వేషంలో ఉన్నా మేము పోలీసులమే అని నిరూపించారు టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఆమె ఒక వినూత్న పంథాను ఎంచుకున్నారు. పోలీసు డ్రెస్ పక్కన పెట్టి, సాధారణ విద్యార్థినిలా చుడీదార్ ధరించి, చేతిలో పుస్తకాలు పట్టుకుని నేరుగా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు.
*అసలేం జరిగిందంటే?
గత కొన్ని రోజులుగా పరీక్షలు జరుగుతున్న సమయంలో, పరీక్షా కేంద్రాల బయట కొంతమంది యువకులు బైక్‌లపై తిరుగుతూ, పరీక్ష రాసి బయటకు వచ్చే విద్యార్థినులను అసభ్య పదజాలంతో వేధిస్తున్నట్లు ఎస్సై అమూల్య దృష్టికి వచ్చింది. పోలీసులు యూనిఫామ్‌లో ఉంటే ఆకతాయిలు పారిపోతారని భావించిన ఆమె, తనే స్వయంగా రంగంలోకి దిగారు. ఒక పంజాబీ డ్రెస్ ధరించి, కాలేజీ విద్యార్థినిలా మారి ఎవరికీ అనుమానం రాకుండా గంటల తరబడి అక్కడే నిలబడ్డారు. తనను కూడా విద్యార్థిని అనుకుని వేధించడానికి ప్రయత్నించిన పోకిరీలను చూసి, ఒక్కసారిగా తన అసలు స్వరూపం చూపించారు. ఎస్సై గెటప్ చూసి నివ్వెరపోయిన ఆకతాయిలకు అక్కడికక్కడే ‘క్లాస్’ పీకడమే కాకుండా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
*సోషల్ మీడియాలో వైరల్:
ఎస్సై అమూల్య తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. “పోలీసులు ఏ రూపంలోనైనా మీ పక్కనే ఉంటారు.. జాగ్రత్త!” అంటూ స్థానికులు పోలీసుల పనితీరును ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా మహిళా రక్షణ విషయంలో అమూల్య చూపిన చొరవ ఇతర పోలీసు అధికారులకు ఆదర్శంగా నిలుస్తోంది.
