* బడ్జెట్ చర్చకు అడ్డుపడినందుకు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బడ్జెట్ చర్చకు అడ్డుపడుతున్నారన్న కారణంతో తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన సీఎం రేవంత్ సభ్యులు తీరు మార్చుకొని బిల్లుల చర్చకు సహకరించాలని కోరారు. అప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను ముట్టడించేందుకు ప్రయత్నించగా.. మార్షల్స్ అడ్డుకున్నారు. సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిస్థితి అలాగే కొనసాగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ సభ్యులను రెండు రోజులపాటు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించగా.. స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.
‘గన్‌తో కాల్చి పడేస్తా’
అసెంబ్లీని కుదిపేసిన కౌశిక్‌రెడ్డి వివాదం…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పాలకవర్గం, వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టు సభగా సాగాయి. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు తీవ్ర దుమారం రేపింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్‌తో కాల్చి పడేస్తానని కౌశిక్‌రెడ్డి చేయితో సైగలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతోకౌశిక్ రెడ్డిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కౌశిక్ రెడ్డి వీడియో పరిశీలించి స్పీకర్ చర్యలు తీసుకోవాలని విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించగా.. స్పందించిన స్పీకర్ ఎథిక్స్ కమిటీకి ఈ అంశాన్ని నివేదించారు.
సీరియస్‌గా తీసుకోవాలి : సీఎం రేవంత్
ఇదే ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. సభలో ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. కౌశిక్ వ్యవహారశైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సూమోటోగా విచారణకు స్వీకరించాలని సూచించారు. దీనిపై స్పందించిన స్పీకర్ సభలో ఆందోళన చేసిన బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.
