* కాకతీయ వర్సిటీలో ఎలుకల స్వైరవిహారం
* నిద్రలో విద్యార్థినులపై దాడి..
* వర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట!
ఆకేరు న్యూస్, వరంగల్: విద్యకు నిలయంగా ఉండాల్సిన కాకతీయ యూనివర్సిటీ (KU) మహిళా హాస్టల్స్ ప్రస్తుతం సమస్యల కూపంగా మారాయి. విద్యార్థినులు చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో, ఎప్పుడు ఏ విషజీవి దాడి చేస్తుందోనన్న భయంతో వణికిపోతున్నారు. గత రెండు రోజులుగా హాస్టల్ గదుల్లో ఎలుకలు స్వైరవిహారం చేస్తూ, నిద్రపోతున్న విద్యార్థినులను కరుస్తుండటంతో క్యాంపస్‌లో భయానక వాతావరణం నెలకొంది.
* అపరిశుభ్రతే శాపమా?
యూనివర్సిటీ క్యాంపస్‌లోని అమ్మాయిల హాస్టల్ పరిసరాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. హాస్టల్ చుట్టూ చెత్తకుప్పలు పేరుకుపోవడం, పిచ్చిమొక్కలు పెరగడంతో ఎలుకలకు అవి ఆవాసాలుగా మారాయి. కేవలం ఎలుకలే కాకుండా, పాములు, వీధి కుక్కలు సైతం హాస్టల్ ప్రాంగణంలో తిరుగుతుండటంతో విద్యార్థినులు ప్రాణభయంతో గడుపుతున్నారు. నిద్రలోకి జారిన వెంటనే ఎలుకలు కాళ్లపై దాడి చేస్తుండటంతో, గాయపడిన పలువురు విద్యార్థినులు ఆసుపత్రి పాలవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాల మండిపాటు:
హాస్టల్ పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, గదుల కిటికీలకు మెష్ డోర్లు (Mesh Doors) బిగించాలని ఎన్నోసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థిని దిశ మరియు ఎస్ఎఫ్ఐ (SFI) జిల్లా అధ్యక్షుడు స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థినుల భద్రతను గాలికి వదిలేసిన వర్సిటీ అధికారుల తీరును వారు తప్పుబట్టారు. తక్షణమే హాస్టల్ సమస్యలను పరిష్కరించి, విద్యార్థినులకు రక్షణ కల్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.
