* ముగ్గురి ప్రాణాలు బలిగొన్న అత్తింటి వేధింపులు..
* పున్నేలు కాల్వలో గర్భిణి, ఇద్దరు చిన్నారుల విషాదాంతం
* ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యే – మృతురాలి తల్లి ఆరోపణ
* మూడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా..కాల్వలోకి నెట్టేసిన కిరాతకులు?
ఆకేరు న్యూస్, హన్మకొండ: జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పున్నేలు క్యానల్లో గర్భిణి సహా ఇద్దరు చిన్నారులు శవాలై తేలడం వెనుక కన్నపేగును కలిచివేసే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం ప్రమాదం కాదని, వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారనే నెపంతో అత్తింటి వారు చేసిన ‘హత్య’ అని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
* వివరాల్లోకి వెళ్తే..
హన్మకొండ జిల్లాకు చెందిన ఫర్హత్ (26)కు వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలు ఉమేరా (8), ఆయేషా (7) ఉన్నారు. ప్రస్తుతం ఫర్హత్ మూడు నెలల గర్భిణి. అయితే, గురువారం పున్నేలు కాల్వలో ఫర్హత్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి శవమై కనిపించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. తొలుత ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించినప్పటికీ, మృతురాలి తల్లి చేస్తున్న ఆరోపణలు వింటే గుండెలు చెరువవుతున్నాయి.
* ఆడపిల్లలని అబార్షన్ చేయించారు.. ఇప్పుడు ప్రాణాలే తీశారు..
మృతురాలి తల్లి కన్నీరుమున్నీరు అవుతూ అత్తింటి వేధింపులను బయటపెట్టారు. “నా బిడ్డను అల్లుడు నిత్యం నరకయాతనకు గురిచేసేవాడు. ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, ఆ తర్వాత రెండు సార్లు గర్భం దాల్చగా.. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఇప్పుడు మళ్ళీ నా బిడ్డ మూడు నెలల గర్భిణి. ఈసారి కూడా అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దానికి నా బిడ్డ నిరాకరించడంతోనే పథకం ప్రకారం పొట్టనబెట్టుకున్నారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
* అసలేం జరిగింది?
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్విమ్మింగ్ పూల్‌కు తీసుకువెళ్తామని చెప్పి ఫర్హత్‌ను, పిల్లలను తీసుకువెళ్లారు. తీరా చూస్తే వారు కాల్వలో శవాలై కనిపించారు. “మీ బావ మంచోడు కాదు, నన్ను చాలా వేధిస్తున్నాడు” అని ఫర్హత్ తన చెల్లెళ్లతో గతంలోనే వాపోయినట్లు సమాచారం. ఘటన జరిగినప్పటి నుండి అత్తింటి వారు పరారీలో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. కడుపున పుట్టిన బిడ్డలను, గర్భిణి అని కూడా చూడకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేస్తోంది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే ఇది ఆత్మహత్యా లేక హత్యా అనేది స్పష్టమవుతుంది.
