Tamilnadu Bus Accident
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు అత్యంత వేగంగా ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మదురై జిల్లాలోని కొట్టంపట్టి సమీపంలో ఈ విషాదం జరిగింది.
* ప్రమాదం ఎలా జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేటు బస్సు చెన్నై నుంచి మార్తాండం వైపు అతివేగంగా వెళ్తోంది. కొట్టంపట్టి సమీపంలోకి రాగానే డ్రైవర్ ఒక్కసారిగా వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ ప్రైవేటు బస్సు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టి, దానిని దాటుకుంటూ అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది.
అదే సమయంలో సరిగ్గా తిరుచిరాపల్లి వైపు వెళ్తున్న తమిళనాడు ప్రభుత్వ బస్సు ఎదురుగా వచ్చింది. నియంత్రణ లేని ప్రైవేటు బస్సు నేరుగా వచ్చి ప్రభుత్వ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రైవేటు బస్సు అతివేగంగా బలంగా గుద్దడంతో ప్రభుత్వ బస్సు రోడ్డుపైనే బోల్తా పడింది. అనంతరం ఆ ప్రైవేట్ బస్సు వేగం తగ్గక పక్కనే ఉన్న ప్రయాణికుల బస్టాప్ షెడ్డులోకి దూసుకెళ్లి ఆగింది.
* ఐదుగురు మృతి.. 40 మంది ప్రయాణికులకు గాయాలు..
ఈ ఘోర ప్రమాదం ధాటికి రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. వీరితో పాటు ప్రమాదం జరిగిన సమయంలో బస్టాప్ షెడ్డులో నిద్రిస్తున్న మరో వ్యక్తి కూడా బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో రెండు బస్సులకు చెందిన సుమారు 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు మరియు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
