* సొంత ఏజెంట్లతో వసూళ్ళ పర్వం
* ఏసీబీ సర్ ప్రైజ్ సోదాల్లో వెలుగులోకి అక్రమాలు
* వరంగల్ రిజిష్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి
* లక్షల్లో నగదు, కిలోల కొద్దీ వెండి, బంగారం.
ఆకేరు న్యూస్, హనుమకొండ : అవినీతి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.. ఎవరైతే మాకేంటి అంటూ లంచం ఇవ్వందే పని చేసే అవకాశమే లేదని తెగేసి చెబతున్నారు. లంచాల కోసం ఏకంగా ఫోన్ పేలు, గూగుల్ పేల లాంటి యూపీఐ సేవలు వాడుకుంటున్నారు. లంచాల కోసం సొంతంగా ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. అవినీతి కోసం బాగా తెగించారు అని ప్రజలు అనుకునే స్థాయిలో హనుమకొండలోని రిజిష్ట్రేషన్ కార్యాలయంలో అక్రమాలు జరిగాయి. అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన అకస్మీక దాడిలో ఈ అవినీతి లీలలు వెలుగు చూశాయి.
హనుమకొండ జిల్లా వరంగల్ (ఆర్.ఓ) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. కార్యాలయం తో పాటు సబ్ రిజిష్ట్రార్ల ఇళ్ళల్లో దాడులు జరిగాయి. సోదాల్లో ఊహించని రీతిలో భారీగా అక్రమ నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
* వసూళ్ళ కోసం ఏజెంట్లు
సోదాల సమయంలో కార్యాలయం లోపల ఏకంగా 20 మంది అనధికార ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరి ప్రమేయం లేకుండా కార్యాలయంలో ఎటువంటి పనులు జరగడం లేదని తేలింది. తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ. 47,450 నగదుతో పాటు 70 రిజిస్ట్రేషన్ కాని డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

* డిజిటల్ దందా.. ఫోన్ పే ద్వారా లక్షల వసూళ్లు:
డాక్యుమెంట్ రైటర్ల సెల్ ఫోన్లను పరిశీలించిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. సబ్ రిజిస్ట్రార్-1 జములా పురం రామనర్సింహారావు, సబ్ రిజిస్ట్రార్-2 దేవులూరి ఆనంద్‌లు డాక్యుమెంట్ రైటర్లతో జరిపిన వాట్సాప్ చాటింగ్ ల్లో అక్రమ వసూళ్లకు సంబందించిన వివరాలు వెలుగు చూశాయి. . కేవలం గడిచిన ఏడాది కాలంలోనే సుమారు రూ. 42 లక్షల రూపాయల మేర ఫోన్ పే (PhonePe) లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించింది. అంతేకాకుండా, 204 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను బాధితులకు అందజేయకుండా అధికారులే తమ వద్ద ఉంచుకున్నట్లు తేలింది. ఈ డాక్యుమెంట్లు లంచం ఇవ్వక పోవడం వల్ల అందజేయలేదని తెలుస్తోంది.
* బంగారం – వెండి ఆభరణాలు
సబ్ రిజిష్ట్రార్లు జమలా పురం రామనర్సింహారావు,దేవులూరి ఆనంద్‌లకు సంబందించి కార్యాలయంలో లభించిన ఆధారాలతో వీరి నివాసాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ గాలింపులో..
నగదు: 24. లక్షల 61వేల 540 రూపాయలు, బంగారం- 820 గ్రాముల, బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండి వస్తువులు లభించాయి. కాగా సుమారు రూ. 30 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు (కపిల్ చిట్స్) స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై రామ నర్సింహారావు, ఆనంద్ లపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక సమర్పించనున్నట్లు ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
* అవినీతి అధికారుల సమాచారం కోసం 9440446106 టోల్ ఫ్రీ నెంబర్ 1064 లకు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలను కోరారు.

————————-
