Bhupalpally Father Murder Case
ఆకేరు న్యూస్, మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఒక ఘోరం చోటుచేసుకుంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో కన్నతండ్రిని ఒక కొడుకు గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. మహాముత్తారం మండలంలోని మహబూబ్‌పల్లి గ్రామంలో ఈ విషాద ఘటన వెలుగుచూసింది.
* అసలేం జరిగిందంటే..
మహబూబ్‌పల్లి గ్రామానికి చెందిన రత్నం సారయ్య (60) అనే వృద్ధుడికి, అతని కొడుకు రవీందర్‌కు మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. గతేడాది కాలంగా తమ భూమికి సంబంధించిన విషయంలో తండ్రికొడుకుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి ఆ భూమి విషయమై ఇద్దరి మధ్య మళ్లీ తీవ్రమైన వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రవీందర్, ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని తండ్రి సారయ్యపై విచక్షణారహితంగా దాడి చేసి నరికాడు.
ఆ దాడితో తీవ్ర రక్తపు మడుగులో పడిపోయిన సారయ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే సారయ్య ప్రాణాలు కోల్పోయాడు.
* భార్య విడాకులు ఇవ్వడంతో.. స్మశానంలోనే నివాసం…
నిందితుడు రవీందర్‌కు దాదాపు 20 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కేవలం 3 నెలలకే భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి రవీందర్ ఇంట్లో సరిగ్గా ఉండేవాడు కాదని, మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని వారు తెలిపారు. కొంతకాలంగా అతను గ్రామ సమీపంలోని స్మశాన వాటికలోనే ఉంటూ, అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వచ్చి వెళ్తుండేవాడని పేర్కొన్నారు.
* పోలీసుల దర్యాప్తు…
ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న మహాముత్తారం ఎస్ఐ గొర్ల రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భూమి వివాదాల కారణంగానే ఈ ఘోరం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పూర్తి వివరాల కోసం దర్యాప్తు వేగవంతం చేశారు.
