*నమ్మి మిర్చి ఇస్తే నట్టేట ముంచాడు..
*వరంగల్‌లో కిలాడీ వ్యాపారి నిర్వాకం
*మూడు కోట్లకు టోకరా వేసి మిర్చి వ్యాపారి పరార్.. వరంగల్‌లో కలకలం
ఆకేరు న్యూస్, వరంగల్:ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుగాంచిన వరంగల్ ఎనుమాముల మార్కెట్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఒక మిర్చి వ్యాపారి సుమారు రూ. 3 కోట్ల రూపాయల నగదుతో పరారవ్వడం ఇప్పుడు అటు వ్యాపార వర్గాల్లో, ఇటు రైతుల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
*వివరాల్లోకి వెళ్తే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సదరు వ్యాపారి, గత కొంతకాలంగా వరంగల్ నగరంలోని దేశాయిపేటలో గల లక్ష్మీ టౌన్షిప్లో అద్దెకు ఉంటున్నాడు. ఎనుమాముల మార్కెట్లో మిర్చి వ్యాపారం చేస్తున్న ఇతడు, గతేడాది మార్చి నెలలో సుమారు రూ. 2.5 కోట్ల విలువైన మిర్చిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
*నమ్మించి.. నట్టేట ముంచి..
మార్కెట్లోని కమిషన్ ఏజెంట్లు, రైతుల వద్ద నుంచి సరుకును కొనుగోలు చేసి, వారికి డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే, గత సోమవారం నుంచి సదరు వ్యాపారి ఎవరికీ కనిపించకుండా పోవడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయామని గ్రహించిన రైతులు, అడ్తీదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాదాపు రూ. 3 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని బాధితులు వాపోతున్నారు.
నమ్మి సరుకు ఇచ్చిన తమను ఇలా నట్టేట ముంచడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. మార్కెట్ యార్డ్ అధికారులు ఈ విషయంలో స్పందించి, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
